బీజేపీకీ తెలుగువారి సత్తా చూపుతాం.. బాలకృష్ణ

hindupuram MLA balakrishna speech in mahanadu
Highlights

ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తున్నారు

తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ యుగపురుషుడని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జీవితం ఓ మహాప్రస్థానం అని.. టీడీపీ ఆవిర్భావమే నూతన శకానికి నాంది పలికిందన్నారు.

ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం దేశంలో సంచలనమని పేర్కొన్నారు. తెలుగువారు అధములు కారు... ప్రథములని స్పష్టం చేశారు. భరతజాతిని తెలుగుజాతి భుజాలపై మోస్తోందన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని...తమను తొక్కాలని చూస్తే పైకి లేస్తామని బాలయ్య అన్నారు. చంద్రబాబు సారథ్యంలో ధర్మ పోరాటం చేస్తున్నామని తెలిపారు. బీజేపీకి తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ కృషి చేస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం ఏదో చేయాలనే తపన ఎన్టీఆర్ కి ఉండేదన్నారు.  ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూశారన్నారు.  చంద్రబాబు న్యాయకత్వంలో  కేంద్రంపై ‘ధర్మపోరాటం’ చేస్తున్నట్లు వివరించారు. టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ఆచరించడమే.. ఆయనకు ఇచ్చే నివాళి అన్నారు.

రాష్ట్రం మొత్తం జరుపుకొనే ఏకైక పండగ మహానాడన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. దేశంలో మొదటిసారి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆరేనని పేర్కొన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సమాజమే దేవాలయం.. పేదవాడే దేవుడనే స్ఫూర్తితో ఎన్టీఆర్ పనిచేశాడని వివరించారు.

loader