అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం నాడు అసెంబ్లీకి వచ్చిన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. వైసీపీ నుండి నలుగురు, టీడీపీ  నుండి ఒకరు బరిలో నిలిచారు.దీంతో ఎన్నికలు జరుగుతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ మొదటగా తన ఓటుహక్కును వినియోగించుకొన్నాడు.  ఓటు హక్కును వినియోగించుకొనేందుకు టీడీఎల్పీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో బాలకృష్ణ అసెంబ్లీకి చేరుకొంటున్న సమయంలో ఓ కుక్క అరిచింది.

కుక్క చెప్పు కోసం అరుస్తోందని బాలకృష్ణ తనతో పాటు వస్తున్న వారికి నవ్వుతూ చెప్పారు. చెప్పు ఎందుకు తిరిగి ఇచ్చావు.. చెప్పూ అంటూ కుక్క అరుస్తోందని హస్యమాడారు.మనం కూడ కుక్క భాషలోనే మాట్లాడాలని ఆయన తెలిపారు. 

మనం అరిచే వాళ్లం కాదు.. కరిచే వాళ్లమని కుక్కకు దాని భాషలోనే చెప్పాలని ఆయన తనతో పాటు వచ్చిన టీడీఎల్పీ సిబ్బందికి నవ్వుతూ చెప్పారు. బాలయ్య మాటలకు ఆయనతో పాటు ఉన్న ఇద్దరు టీడీఎల్పీ సిబ్బంది పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అలా నవ్వుతూనే ఆయన రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు.

ఏపీ అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు వైసీపీకి మద్దతు ప్రకటించారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్యకు ఓటేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. వైసీపీ తరపున మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రాంరెడ్డి, పరిమిళ్ నత్వానిలు బరిలో నిలిచారు. టీడీపీ తరపున వర్ల రామయ్య పోటీలో ఉన్నారు.

రాజ్యసభ అభ్యర్ధిగా గెలుపొందాలంటే ఒక్కో అభ్యర్ధికి కనీసం 34 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది. టీడీపీ పోటీ నామమాత్రమేనని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.