అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంచుతూ కర్నూలు రేంజ్‌ డీఐజీ నాగేంద్రకుమార్‌ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఉన్న గన్‌మన్లను మరింతగా పెంచారు. అదనంగా 8 మంది గన్‌మెన్‌ను నియమించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో మంత్రి పరిటాల సునీత కుటుంబానికి కొత్త ప్రభుత్వంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ కుటుంబానికి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిటాల సునీత పలుమార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భద్రత పెంచినట్లు సమాచారం. 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొద్ది రోజులకే పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపుపై సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ కొందరు పోస్టులు చేస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ముగింపు చెప్పాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రౌడీయిజం పెరిగిపోతుందన్న విమర్శలకు చెక్ పెడుతూ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.