తనకు అన్యాయం చేయాలని చూసిన భర్తతోపాటు.. అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్యను కాదని.. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త భార్యకు తెలియడంతో తట్టుకోలేకపోయింది. తనకు అన్యాయం చేయాలని చూసిన భర్తతోపాటు.. అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. నిందితురాలు కాస్త కోర్టు ఆశ్రయించడంతో.. నిందితుడి భార్యకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందంటూ ఓ మహిళపై నెల్లూరు జిల్లా దిశ పోలీస్‌ స్టేషన్‌లో వివాహిత కె.సునీత ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్‌ 498 ఏతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన వివాహిత... భర్తను మొదటి నిందితుడిగా, అతనితో సంబంధం పెట్టుకున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు.

దిశ పోలీసులు సెక్షన్‌ 498ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ నిందితురాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌, ఫిర్యాదు చేసిన వివాహిత భర్తకు ఏవిధంగాను బంధువు కాదన్నారు. 

ఈ నేపథ్యంలో పిటిషనర్‌పై పోలీసులు సెక్షన్‌ 498ఏ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వ్యాజ్యంలో మొదటి నిందితుడిగా ఉన్న వ్యక్తిపై విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.