టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు చెందిన రావి టెక్స్‌టైల్స్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఇది స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని మనుషుల పనేనంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఫోన్ చేసి చంపేస్తామని వైసిపి నేత మెరుగు మాల కాళీ బెదిరించాడు. రేపు వంగవీటి రంగా వర్ధంతికి హాజరైతే చంపేస్తానంటూ కాళీ బెదిరించినట్లుగా తెలుస్తోంది. రావిని బెదిరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు కార్యకర్తలు. దమ్ముంటే రావిని టచ్ చేయాలని సవాల్ విసిరారు. పెద్ద సంఖ్యలో రోడ్లపై చేరి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్యకర్తలను సమదాయించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తేలేంతవరకు కదిలేది లేదంటూ పోలీసులతో కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. మరోవైపు... రావి వెంకటేశ్వరరావుకు చెందిన రావి టెక్స్‌టైల్స్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇది వైసీపీ కార్యకర్తల పనేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
