నంద్యాల జిల్లా అవుకులో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవుకు జెడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మీ, ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా నంద్యాల జిల్లా అవుకులో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవుకు జెడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మీ, ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
తనకు ఫోన్‌లోని వ్యక్తిగత విషయాలను బయటకు తీసి తనను అవమానిస్తున్నారని చల్లా శ్రీలక్ష్మీ ఆరోపించారు. ఈ విషయాలు చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలకు సరైన రక్షణ లేదని చల్లా శ్రీలక్ష్మీ వాపోయారు. చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, ఎంపీపీ చల్లా రాజశేఖర్‌లపై ఆమె ఆరోపణలు చేశారు. తనను అధికారిక కార్యక్రమాలకు కూడా పిలవడం లేదన్నారు. మరి దీనిపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా.. చల్లా రామకృష్ణారెడ్డి, చల్లా భగీరథ రెడ్డిల మరణాలతో చల్లా శ్రీలక్ష్మీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెకు రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు శ్రీలక్ష్మీ. రాజకీయ పదవులతో పాటు ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా చల్లా కుటుంబంలో వున్నట్లుగా తెలుస్తోంది.
