అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవోను సస్పెండ్ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జగన్ ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలించడానికి జీవోను జారీ చేసింది. 

ఇదిలావుంటే, అమరావతి ప్రాంతంలోని తుళ్ళూరు మండలంలో అమరావతి ని రాజధాని గా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న  దీక్ష శిబిరాలలో తుళ్ళూరు మండల వైద్య సిబ్బందితో కరోనాపై సీఐ ఏ శ్రీహరిరావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తుళ్ళూరు మండల వైద్య సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పి ఝాన్సీ రాణి, జి వెంకటరమణ లు పాల్గొన్నారు. 

తుళ్ళూరు, పెదపరిమి దీక్ష శిబిరాలలో అవగాహన కల్పించారు. ప్రజా సమూహం జరగడం వలన కరోన(కోవిడ్19) వైరస్ వ్యాపించే అవకాశం ఉందని  డబ్ల్యుహెచ్ఓ కేంద్ర, రాష్ట్ర వైద్య శాఖల సూచన మేరకు తుళ్ళూరు శిబిరం నిర్వాహకులు జొన్నలగడ్డ రవి, కాట అప్పారావులకు, పెదపరిమి దీక్ష శిబిరం నిర్వాహకులు అతిపట్ల బాలయ్య కు సీఐ శ్రీహరిరావు శిబిరాల నిర్వహణ వైరస్ అదుపు అయ్యే వరకు కొన్ని రోజులు నిరసన దీక్షలు నిలిపివేయాలని సిఐ శ్రీహరిరావు నోటీసులు అందజేశారు.