అమరావతి: అమర్ రాజా ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిడెట్ కు కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకుంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో వైఎస్ జగన్ కు హైకోర్టుకు షాక్ తగలగా, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు తాత్కాలిక ఊరట లభించింది. 

ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ అమర్ రాజా ఇన్ ఫ్రా ప్రైవెట్ లిమిటెడ్ వేసిన పిటిషన్ మీద సోమవారం విచారణ జరిగింది. తమకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన 33 నెంబర్ జీవోను అమర్ రాజా ఇన్ ఫ్రా లిమిటెడ్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. 

Also Read: గల్లా జయదేవ్ ఫ్యామిలీకి జగన్ షాక్: అమర్ రాజా నుంచి 253 ఎకరాలు వెనక్కి

గతంలో చిత్తూరులో అమర్ రాజా ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం 483 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూమిలో వైసీపీ ప్రభుత్వం 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 

రూ. 2100 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలను విస్తరించి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమర్ రాజా ఇన్ ఫ్రా నిలబెట్టుకోలేదని ప్రభుత్వం చెప్పింది. కేటాయించిన భూమిలో ఇ్పపటి వరకు 229.66 ఎకరా ల భూమిని మాత్రమే వినియోగించుకున్నారని, మిగతా భూమిని ఉపయోగించుకోలేదని, దాంతో దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం వివరించింది.