చిత్తూరు: చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇన్ ఫ్రా టెక్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం మంగళవారం షాకిచ్చింది. ఈ కంపెనీ టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందింది.

చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇన్ ఫ్రా టెక్ కంపెనీకి కేటాయించిన 253 ఎకరాల భూమని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకొంది. రూ. 2100 కోట్ల పెట్టుబడితో 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోలేదని ప్రభుత్వం కంపెనీకి తెలిపింది.

ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 483.27 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే దీనిలో 253.61 ఎకరాల భూమిని ఇంకా వినియోగించలేదని ప్రభుత్వం వివరించింది.ఈ కంపెనీలో ఇప్పటి వరకు 4310 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు.  కంపెనీకి కేటాయించిన భూమిలో ఇప్పటివరకు 229.66 ఎకరాల భూమిని మాత్రమే వినియోగించారు.

ఉద్యోగాల కల్పనలో ఇచ్చిన హామీని కంపెనీ నిలుపుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందంలో భాగంగా ఉద్యోగాలు కూడ కల్పించలేదని ఈ కంపెనీకి కేటాయించిన  భూమిని వెనక్కి తీసుకొంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు మంగళవారంనాడు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ భూమిని వెనక్కి తీసుకోవడంపై కంపెనీ ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి. ఈ కంపెనీ టీడీపీకి చెందిన జయదేవ్ కుటుంబానిది కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.