అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారంనాడు హైకోర్టు విచారించింది. జీఎన్ రావు కమిటీ చట్టబద్దత, రాజధాని తరలింపు అంశాలపై పిటిషన్ దాఖలు చేశారు.

రాజధానిపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటుందని వెంటనే విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి వివరాలు అందలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కమిటీలపై  అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటు విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది  ఏఫీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

బోస్టన్ కమిటీని ఎవరు నియమించారు, నియమనిబంధనలు చెప్పాలని పిటిషనర్ తరపు లాయర్ కోరారు. ప్రభుత్వం నుండి  సమాచారం వచ్చిన తర్వాత వివరాలను అందిస్తామని అడ్వకేట్ జనరల్‌‌ హైకోర్టుకు వివరించారు.

జనవరి 21వ తేదీకి ఈ పిటిషన్‌పై అందరూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 23వ తేదీన విచారణ చేపడుతామని హైకోర్టు తెలిపింది.