విజయనగరం జిల్లా టీడీపీలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు- మీసాల గీతల మధ్య వివాదానికి చెక్ పెట్టారు ఏపీ తెలుగుదేశం చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు. దీనికి సంబంధించి కొత్త కార్యాలయంపై అచ్చెన్నాయుడు సర్క్యూలర్ విడుదల చేశారు. 

కాగా, టీడీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మీసాల గీత తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం అని బోర్డు పెట్టారు. అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పార్టీ కార్యాలయాన్ని​ ఎత్తేయాలని గీత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో అశోక్‌ వర్గానికి వ్యతిరేకంగా వారం రోజుల క్రితం ఆమె పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో గీతపై అశోక్‌ వర్గం పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

ఈ గొడవకు పుల్‌స్టాప్‌ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధిష్టానం అశోక్‌ బంగ్లాకు బదులుగా కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, తన ఆఫీసుకు తగిలించుకున్న బోర్డును తీసేయాలని గీతను ఆదేశించింది.

అధిష్టానం హామీ మేరకు బోర్డు తొలగించారు గీత. అయితే వారం అయినా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించకపోవడంతో గీత మళ్లీ తన కార్యాలయానికి పార్టీ ఆఫీసు బోర్డును ఏర్పాటు చేసింది. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.