ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం హీరో శివాజీ వినూత్న కార్యక్రమానికి తెర లేపారు. ఈ నెల 10వ తేదీన ‘హోదా కోసం జాగారం’ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. బీజేపీ నేతలకు తాను చేపడుతున్న జాగారం సెగ తగలాలని ఆయన  అన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 7గంటల నుంచి 11వ తేదీ ఉదయం 11గంటల వరకు ఈ హోదా ఉద్యమం సాగుతుందని తెలిపారు.

తనకు ఎలాంటి రాజకీయ అజెండాలు లేవని ఆయన అన్నారు. కేవలం రాష్ట్రానికి హోదా సాధించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతీదీ రాజకీయంగానే ఆలోచిస్తున్నారని వాపోయారు. రాజ్యాధికారాన్ని దక్కించుకునేందుకు అన్ని పనులు చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు చేసే ప్రతి పనీ సీటు కోసమేనని విమర్మించారు.

నోట్ల రద్దు విషయంలోనూ బీజేపీ తెలివిగా ప్రవర్తించిందని ఆయన అన్నారు. ముందుగానే నోట్లు మార్చేసుకొని ఆ తర్వాత నోట్ల రద్దు చేశారన్నారు. ఆ డబ్బును  ఇప్పుడు ఎన్నికల్లో రూ.కోట్లు పంపిణి చేస్తున్నారని మండిపడ్డారు. శాశ్వత అధికారం కోసం బీజేపీ దుర్మార్గపు ఆలోచనలు చేస్తోందన్నారు. ఇలాంటి ఆలోచనలు దేశానికి మంచివి కాదని అభిప్రాయపడ్డారు.