అమరావతి: నాలుగు రోజులుగా వర్షాలతో రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

వరద ప్రాంతాల టిడిపి నాయకులతో చంద్రబాబు  గురువారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో టిడిపి ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. తమ ప్రాంతాల్లో జరిగిన నష్టంపై టిడిపి నాయకులు వివరించారు.బాధితులకు టిడిపి నేతలు అండగా ఉండాలని చంద్రబాబు కోరారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. వరి, పత్తి, మిరప, వేరుశనగ, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయన్నారు.వేలాది ఇళ్లు నీట మునిగి దెబ్బతిన్నాయి. వేల కిమీ రోడ్లు ధ్వంసమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టిడిపి హయాంలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందే సర్వ సన్నద్దం. గంట గంటకు అధికారులతో టెలికాన్ఫరెన్స్ లు, యుద్దప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు చేపట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

తీరం దాటే సమయాన్ని, తాకే ప్రదేశాన్ని ముందే అంచనా వేసేవాళ్లం. ఏ ప్రాంతంలో ఎంత నష్టం చేస్తుందో రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్(ఆర్టీజిఎస్ ) ద్వారా ముందస్తు అంచనా... ప్రజలను ముందే అప్రమత్తం చేసేవాళ్లం. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇప్పటి వైసిపి ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి లేవన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్(ఆర్టీజి)ని నిర్వీర్యం చేశారు. ప్రజల ప్రాణాలన్నా, ఆస్తినష్టం అన్నా వైసిపికి లెక్కేలేదన్నారు.

అమరావతిపై వరదలో ముంపుకు గురౌతోందని దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.వరద నీటితో కూడా వైసిపి నేతలు చెలగాటమాడరని చెప్పారు.
జల నిర్వహణలో ఘోరంగా విఫలం అయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు.

సకాలంలో సరైన మోతాదులో నీటి విడుదల చేయలేదన్నారు.  వైసిపి తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిందిగా కోరారు. బాధిత ప్రజానీకానికి టిడిపి నాయకులు అండగా ఉండాలి. భారీవర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన సూచించారు.

కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం మానవధర్మం. బాధితులను ఆదుకోవడం ప్రజా ప్రతినిధుల బాధ్యతగా ఆయన చెప్పారు. ఏడాదిన్నరగా వరుస విపత్తుల్లో బాధితులకు సాయం శూన్యమన్నారు.

రైతులకు పంటనష్టం పరిహారం అందించలేదన్నారు.  అధికార వైసిపి నిర్లక్ష్యానికి ప్రజలే సమాధానం ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాన ప్రతిపక్షంగా మన బాధ్యత నిర్వర్తించాలని ఆయన సూచించారు..  దెబ్బతిన్న రైతులను, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.