రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల్లో  గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రోజురోజుకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం భారీగా పెరుగుతుంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 9.6 అడుగులకు చేరింది. 

గంట గంటకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో  మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సముద్రంలోకి సుమారు 8లక్షల 80వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.2 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విలీన మండలాల్లో శబరీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో చింతూరు, వి.ఆర్‌.పురం, కూనవరం మండలాల్లో రహదారులు నీట మునిగాయి. 

దేవీపట్నం మండలంలోని సీతపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి తీరం వెంట ఉన్న ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. అటు కోనసీమలోనూ గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని, నాటు పడవలపై ప్రయాణించరాదని అధికారులు హెచ్చరించారు. 

అటు పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం కడెమ్మ వంతెన నీటమునిగింది. అలాగే కొత్తూరు కాజ్ వే పైకి  5మీటర్లు నీరు చేరడంతో 19 గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్థంభించిపోయాయి. 

దీంతో అధికారులు ప్రత్యేక లాంచీల్లో నిత్యావసర వస్తువులను ఆ గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. వరద నీరు పోటెత్తడంతో పోలవరం ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపోతే పాత పోలవరం, కమ్మరిగూడెం, నూతనగూడెం, కొత్త పట్టిసీమ, గుటాల వంటి  గ్రామాల్లో ఏటుగట్లు బలహీనంగా ఉండటంతో ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

వరద ప్రభావం గంటగంటకు పెరుగుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆదేశించింది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చెయ్యాలని ఆదేశించింది. అలాగే భద్రాచలం, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నేపధ్యంలో నీటి ఉధృతిని పర్యవేక్షిస్తూ.. తగిన సహాయక చర్యలకు అధికారులను సిద్ధం చేయాలని సూచించింది.