కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు.. శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది.

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోని 52973 క్యూసెక్కుల ఇన్‌ఫోన్ల్ వస్తుంది. ఇందులో జూరాల నుంచి 52856 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి వినియోగం ద్వారా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు హంద్రీ నది నుంచి 117 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుకుంటుంది.
శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 816.20 అడుగులకు చేరుకుంది. ఇక, ప్రాజెక్టులో 38 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నాయి. భారీ వర్షాలకు ముందు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 805 అడుగులుగా ఉంది. ప్రస్తుతం వస్తున్న వరదలతో రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలకు ముందు కృష్ణా బేసిన్‌లోనీ ఏ ప్రాజెక్టులోనూ ఆశించిన స్థాయిలో నీళ్లు లేవు. తాగడానికి కటకటగా ఉన్న సమయంలో అటు కర్ణాటక, ఇటు తుంగభద్ర నది పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు ఆనందపడుతున్నారు. ఇక, ప్రాజెక్టులలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో వరద నీరు వచ్చి చేరుతున్నప్పటికీ.. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షాలు కురిస్తే ఆయా ప్రాజెక్టులు నిండేందుకు అవకాశం ఉండదని ఇంజనీర్లు భావిస్తున్నారు.
ఇదిలాఉంటే, తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. తుంగభద్ర జలాశయం ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో డ్యాం వరద నీటితో ఉప్పొంగుతోంది. గత నాలుగు రోజుల నుంచి తుంగభద్ర జలాశయంకు వరద కొనసాగుతుంది. సోమవారం ఉదయం 44 వేల క్యూసెక్కుల ప్రవాహంతో మొదలై.. అదే రోజు మధ్యాహ్నంకు 55 వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం పెరిగింది. ఆ తర్వాత బుధవారం ఉదయం నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా జలాశయంకు ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 50 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. తుంగభద్ర ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. గురువారం ఉదయం నీటి మట్టం 1615.56 అడుగులకు చేరుకుంది.