Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు.. ఆందోళన చెందుతున్న ప్రజలు..
నెల్లూరు (Nellore), చిత్తూరు (Chittoor) జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. మొన్నటివరకు కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే.. మరోసారి వానలు దండికొడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) వానలు వదలడం లేదు. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. మొన్నటివరకు కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే.. మరోసారి వానలు దండికొడుతున్నాయి. ఈ నెల 29వ తేదీన అండమాన్ అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో నెల్లూరు (Nellore), చిత్తూరు (Chittoor) జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలు రాత్రి కురిసిన వర్షానికి తడిచి ముద్దయ్యాయి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఆత్మకూరుతో పాటుగా ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలకే వాగులు, వంకలు పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వర్ష బీభత్సం నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం (low pressure area) ఏర్పడనుంది. ఇది తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర అల్పపీడనంగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో మరో 24 గంటలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ఏపీలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మొత్తంగా డిసెంబర్ 30 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
Also Read: Heavy Rains in AP: ఏపీని వదలని వాన.. 29న మరో అల్పపీడనం.. ఆ జిల్లాలో స్కూల్స్‌కు సెలవు..
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు (Somasila project) ఎగువ నుంచి 44,620 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు.. 41,080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెంలో వరదల కారణంగా గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం దెబ్బతింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మార్గాన్ని వీలైనంత తర్వగా పునరుద్దరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.