శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. మూడు రోజుల్లో గేట్లు ఎత్తే చాన్స్..!
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. నాలుగు రోజుల్లోనే 100 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కృష్ణా బేసిన్ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. నాలుగు రోజుల్లోనే 100 టీఎంసీల నీరు వచ్చి చేరింది. నిన్న ఒక్క రోజులోనే ప్రాజెక్టులోకి 29 టీఎంసీల నీరు చేరింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 147 టీఎంసీలకు చేరింది. ఎగువన ఉన్న జూరాల నుంచి 1.7 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1.65 లక్షల క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోని మూడు లక్షలకు పైగా ఇన్‌ఫ్లో కొసాగుతుంది.
ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం.. 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 147 టీఎంసీలు ఉంది. ఇంకో 70 టీఎంసీల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి జలకళను సంతరించుకోనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3 లక్షల 24 వేల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. మరికొన్ని రోజల పాటు శ్రీశైలం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మరో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిగా నిండి.. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక, తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతంది. దీంతో తుంగభద్ర డ్యామ్ 31 గేట్లు ఎత్తి నీరును దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక, ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 105 టీఎంసీలుగా కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 98.2 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 1,67,281 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 1,50,503 క్యూసెక్కులుగా ఉంది.