Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆక్సీజన్ కొరత అవాస్తవం.. అవన్నీ కోవిడ్ మరణాలే.. అనిల్ కుమార్ సింఘాల్

ఆక్సిజన్ కొరత వల్ల కర్నూలు, అనంతపురం జిల్లాలో పలువురు మృతి చెందారని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. 

health secretary anil kumar singhal say there is no oxygen shortage in state - bsb
Author
Hyderabad, First Published May 2, 2021, 8:21 AM IST

ఆక్సిజన్ కొరత వల్ల కర్నూలు, అనంతపురం జిల్లాలో పలువురు మృతి చెందారని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. 

చనిపోయిన వారంతా కోవిడ్-19, వివిధ కారణాలతో మృతి చెందినవారే నని, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు అని అన్నారు. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో 11 మంది మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనా వల్ల కొన్ని మరణాలు, అదే విధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వయసు పైబడిన వారు చనిపోయారని, ఆక్సిజన్ కొరత వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదన్నారు. 

అదే విధంగా  కర్నూలు కేఎస్ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ లో సరిపడా మెడికల్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయని, అక్కడ చనిపోయిన వారంతా కోవిడ్, ఇతరత్రా కారణాలతో చనిపోయారని తెలిపారు.  ఈ విషయమై డీఎంహెవో, డాక్టర్లు, డ్రగ్ కంట్రోల్ ఏడీ బృందం ఎంక్వైరీ టీమ్ వెంటనే అలర్ట్ అయి కేఎస్ఆర్ ఆస్పత్రికి వెళ్లి ప్రాథమిక తనిఖీ చేసి నివేదిక ఇచ్చిందని వివరించారు. 

అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ బెడ్ల వరకు ఆక్సిజన్ సరఫరా విషయమై అణువణువు తనిఖీ చేశామన్నారు. ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సరఫరా, ఏపీఎమ్ఐసి ఇంజనీరింగ్ శాఖ ద్వారా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామన్నారు. 

అనంతపురం: ఆక్సిజన్ అందక పది మంది కరోనా రోగులు మృతి...

ఆక్సిజన్ సరఫరా వల్ల, ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని, రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని, ఆక్సిజన్ కొరత రాకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ నిల్వ ఉంచుతున్నామని వెల్లడించారు. 

కరోనా నేపథ్యంలో 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 ఏప్రిల్ 1వ తేదీనాటికి అనంతపురం సర్వజన ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్ ఆస్పత్రి, హిందూపురం జిల్లా ఆసుపత్రి, కదిరి, గుంతకల్లు ఏరియా ఆస్పత్రుల్లో 130కి పైగా ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. 

2020 ఏప్రిల్ 1 లో నాన్ ఐ సియు ఆక్సిజన్ బెడ్లు ఒకటి లేకపోగా 2021 ఏప్రిల్ 1వ తేదీనాటికి జిల్లాలో 595 నాన్ ఐ సియు ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని వివరించారు. నాన్ ఐ సియు నాన్ ఆక్సిజన్ బెడ్లను 2021 ఏప్రిల్ 1వ తేదీనాటికి 551 బెడ్లను, ఏప్రిల్ నెలలో 120 బెడ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ లు గతేడాది ఒకటి లేకపోగా సంవత్సర కాలంలో జిల్లాలోని 6 ప్రభుత్వాసుపత్రుల్లో 40,000 లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు.  

జిల్లాలో ఆక్సిజన్ సమస్య రాకూడదని మూతపడిన ప్రైవేట్ ఆక్సిజన్ ప్లాంట్ లను సైతం తెరిపించే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటికే శింగనమల లో 8వేల లీటర్లు, హిందూపురం పరిధిలో 10 వేల లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.అదే విధంగా డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర సిబ్బందిని 1010 మందిని నియామకం చేశామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుగా కరోనా ను ఎదుర్కోవడం కోసం అన్ని రకాల ముందస్తు చర్యలు ఏర్పాటు చేసిందని వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పూర్తి సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై పూర్తి దృష్టి  పెట్టిందని తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అదే క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ దిగ్విజయంగా కొనసాగుతుందని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios