Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో సెప్టెంబర్ 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే.. మంత్రి విడదల రజినీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేరపట్టింది.

Health Minister Vidadala Rajini says door to door health survey from September 15 ksm
Author
First Published Sep 8, 2023, 10:08 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేరపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 30 నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గురువారం రోజున మంగళగిరిలో రజనీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు నెలరోజుల పాటు చేపట్టిన కార్యాచరణను మంత్రి విడదల రజినీ వివరించారు. వివరాలు.. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి వారి సంబంధిత అధికార పరిధిలోని ఇళ్లను సందర్శిస్తారు. వారి నుంచి సేకరించిన వివరాలను ఏఎన్‌ఎంలు, క్లస్టర్ ఆరోగ్య అధికారులను అందజేస్తాను. ఆ తర్వాత సంబంధిత ఇళ్లను ఆరోగ్య సిబ్బంది సందర్శించి వ్యాధుల వివరాలను నమోదు చేస్తారు. బీపీ, బ్లడ్ షుగర్, ఇతర పరీక్షలను కూడా నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన రికార్డును నిర్వహిస్తారు. 

ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నెంబర్లు ఇస్తారు. ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య  సురక్ష శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రోజు ప్రతి మండలంలోనూ ఏదో ఒక వైఎస్సార్ విలేజ్‌ క్లినిక్‌తో పాటు, ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ఒక్కో శిబిరానికి ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులను అందుబాటులో ఉంచుతారు. అవసరమైతే రోగులను ఆసుపత్రులకు రెఫర్ చేస్తారు.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో ఆరోగ్య శిబిరానికి హాజరవుతారని ఆరోగ్య శాఖ మంత్రి విడదల  రజనీ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షా సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు ప్రతిరోజూ శిబిరం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలకు తహశీల్దార్‌, ఎంపీడీఓ, పీహెచ్‌సీ వైద్యాధికారులు బాధ్యత వహిస్తారని మంత్రి తెలిపారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు పట్టణ ప్రాంతాల్లో క్యాంపులను చూసుకుంటారని చెప్పారు. ప్రతి ఆరోగ్య శిబిరంలో, రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన వైద్య పరికరాలను ఉంచడంతో పాటు, 105 రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉంచబడతాయని అధికార వర్గాలు తెలిపాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios