అమరావతి: రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా జగన్ తీరు ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాడు-నాడు, రివర్స్ టెండరింగ్ అంటూ బోర్డులు, చాక్ పీస్ లు లెక్కలు వేస్తున్నారని అన్నారు. మరోవైపు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాతో పాటు 12 జిల్లాలు రెడ్ జోన్ లోకి వెళ్లాయి.... ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం వల్ల రాష్టంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని ఆరోపించారు. 

''కరోనా టెస్ట్ ఫలితాలను ఆలస్యంగా వెల్లడిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. కమ్యూనిటీ ట్రాన్స్ ఫర్ జరుగుతోందని నేను గతంలోనే చెప్పాను. 72 కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. దీనిని ఏం సమాధానం చెబుతారు?'' అని ప్రశ్నించారు. 

''కరోనా నిర్మూలనకు సూచనలు చేసిన వారిపైనే  వైసిపి నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. విజయవాడను కర్ఫ్యూ వాతావరణానికి తీసుకువచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  ఫ్రంట్ లైన్ వారియర్స్ పనిచేస్తున్నా ప్రభుత్వం మాత్రం లెక్కలేనితనంతో వ్యవహరిస్తోంది. అందువల్ల కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి'' అని ఉమ సూచించారు. 

''విపత్కర పరిస్థితులను చక్కదిద్దాల్సిన సీఎం జగనే వీడియో గేమ్స్ కు పరిమితం అయ్యారు. విజయసాయిరెడ్డి అచ్చోసిన అంబోతులా తిరుగుతున్నారు. విశాఖలో ఛాతి ఆసుపత్రిలో 51 కేసుల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు. వైసీపీ నేతల ఊరేగింపులతో కరోనా కేసులు పెరుగుతున్నాయి'' అని ఆరోపించారు. 

''ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని చెబుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  చంద్రబాబునాయుడు రాసిన లేఖలకు స్పందన లేదు. ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రధాని, చంద్రబాబు చెబుతుంటే జగన్ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. మీడియా ముందుకు వచ్చే ధైర్యం ఎందుకు చేయడం లేదు? 24 గంటల్లో 61 కేసులు బయటపడితే ఏం సమాధానం చెబుతారు'' అని నిలదీశారు.

''ట్రూనాట్, వీటీఎం, ఆర్టీపీసీ టెస్ట్ లు జరుగుతున్నాయా లేక ఆపారో జగన్ సమాధానం చెప్పాలి. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో చేస్తున్నారా, లేక ఆపారా, లేక పూర్తిస్థాయిలో జరుగుతున్నాయా సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని మరణాలు చోటుచేసుకున్నాయో చెప్పాలి. ఏయే జిల్లాల్లో ఎన్ని టెస్ట్ లు చేశారో చెప్పాలి.  వాస్తవాలు ఎందుకు దాస్తున్నారు'' అని అడిగారు.

''మరోవైపు ఇంగ్లీషు మీడియం కావాలా, తెలుగుమీడియం కావాలా అని వాలంటీర్లను అడ్డుపెట్టుకుని తల్లిదండ్రులతో సంతకాలు చేయిస్తున్నారు. పదో తరగతి పరీక్షలను పెట్టగలిగారా. అదే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనలతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఏం చేస్తారో కూడా కనీసం చెప్పడం లేదు''  అని ఆరోపించారు. 

''అమరావతి రైతులను రోడ్డున పడేశారు. రాజధాని తరలింపు కోసం విశాఖలో కేసులను దాస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్స్, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏపీలో పర్యటించి ఏం జరుగుతుందో తెలియజేయాలి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి'' అని ఉమ డిమాండ్ చేశారు.