కడప: వైయస్ఆర్ కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ అబల ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తమామలు నిత్యం కులం పేరుతో దూషించడంతోపాటు కట్నకానుకలు తేవాలంటూ రోజూ దాడికి పాల్పడటంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది.
 
ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటరెడ్డిపాలెంకు చెందిన డమాయి హారతి అనే యువతి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ లో కడప జిల్లాకు చెందిన రామరాజు అనే యువకుడి ప్రేమలో పడింది. 

ఇటీవలే హారతి, రామరాజులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం రామరాజు కుటుంబ సభ్యులకు నచ్చలేదు. రామరాజు సొంతూరైన కడప వచ్చేశాడు. కడపకు వచ్చినప్పటి నుంచి రామరాజు తల్లిదండ్రుల మాటలు విని నిత్యం హారతిని వేధింపులకు గురి చేసేవాడని హారతి సూసైడ్ నోట్ లో స్పష్టం చేసింది. 

తన భర్త, అత్తమామలు నిత్యం భౌతిక దాడులకు పాల్పడేవారని ఆరోపించింది. తీవ్రంగా వేధించడంతో తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో తెలిపింది. అనంతరం సూసైడ్ చేసుకుని చనిపోయింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు FIR No.243/2019 కేసు నమోదు చేశారు. సెక్షన్ 304, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పోస్ట్ మార్టమ్ అనంతరం హారతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. 

హారతి మృతదేహాన్ని వారి తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. హారతి ఆత్మహత్యకు కారణమైన భర్త రామరాజు, అత్త, మామలపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ కులవివక్షను కేసును సీరియస్ గా తీసుకోవాలని కోరారు.