రెండోసారి ఆడపిల్లే పుట్టిందని పచ్చి బాలింత అని కూడా చూడకుండా అత్తింటివాళ్లు ప్రత్యక్ష నరకం చూపించిన దారుణ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. మామ, అత్త, భర్త, మరిది కలిసి ఏడు రోజుల బాలింత అని కూడా చూడకుండా నోట్లో గుడ్డలుకుక్కి మరీ  చితకబాదారు. వివరాల్లోకి వెడితే...

నాయక్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనను స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి బాలింతను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధర్మవరానికి చెందిన లక్ష్మిదేవి బాయికి ఆరేళ్ల క్రితం నాయక్‌నగర్‌కు చెందిన జగన్‌మోహన్‌ నాయక్‌తో వివాహమైంది. జగన్మోహన్ చెన్నై ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ క్వాలిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. 

వీరికి నాలుగన్నరేళ్ల పాప ఉంది. ఈ నెల 18న లక్ష్మిదేవి బాయి మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 22న లక్ష్మిబాయి డిశ్చార్జ్‌ అయి అత్తింటికి వెళ్లింది. అప్పటి నుంచి బాలింతకు ప్రత్యక్ష నరకం మొదలైంది. రెండో కోడలు కట్నం కింద భూములు, ఆస్తులు తెచ్చింది నువ్వేం తెచ్చావంటూ తిట్టడం మొదలెట్టారు. దీనికి తోడు రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందంటూ వేధించారు. 

బుధవారం ఉదయం లక్ష్మిదేవిబాయిపై మామ శంకర్‌నాయక్‌, అత్త శాంతిబాయి, భర్త జగన్‌మోహన్‌ నాయక్, మరిది పరమేష్‌నాయక్‌ దాడిచేసి విచక్షణారహితంగా చితకబాదారు.  దెబ్బలు తట్టుకోలేక  ఆమె కేకలు వేసింది. కేకలు విన్న చుట్టుపక్కల వారు, మీడియా విషయాన్ని టూటౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాలింతను స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు తీసుకొని ఆస్పత్రికి తరలించారు.  అత్తా, మామ, భర్త, మరిదిపై పోలీసులు కట్నం, వేధింపులు తదితర కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీదేవిబాయిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి పరామర్శించారు.