అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత భూమా అఖిలప్రియ తనపై ఆరోపణలు చేయడం వెనక ఎవరో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి హఫీజ్ ఖాన్ కారణమని భూమా అఖిల ప్రియ ఆరోపించిన విషయం తెలిసిందే. 

తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే కర్నూలు సెంటర్ లో ఉరి తీయండంటూ బుధవారం సవాల్ చేసిన హఫీజ్ ఖాన్ అఖిలప్రియ ఆరోపణలపై గురువారం మరోసారి స్పందించారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. కరోనాను అడ్డం పెట్టుకుని తనపై నిందలు వేస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ వ్యాపించి ప్రజలు చావాలని తాను కోరుకుంటానా అని ఆయన ప్రశ్నించారు.  తనపై వచ్చిన ఆరోపణల మీద కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించినా సరేనని ఆయన అన్నారు.

కర్నూలు జిల్లాలో కరోనా పెరగడానికి కారణం హఫీజ్ ఖాన్ అని అందరికీ తెలుసునని భూమా అఖిలప్రియ ఇటీవల అన్నారు. జిల్లాలో కేసులు పెరగడానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.    

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ర్యాలీ తీశారని, ఎమ్మెల్యే తీరును చూసి దేశమంతా మనల్ని చూసి నవ్వుతోందని ఆమె అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చిందని అన్నారు. వారి కుటుంబాలకు కాళహస్తి ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని అడిగారు.