న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. హోదా అనే లేని వ్యవస్థపై ఇంకా మాట్లాడితే రాజకీయంగా ఇబ్బందులు పడుతారని ఆయన జగన్ ను హెచ్చరించారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. హోదాపై రాజకీయం చేయాలని చూస్తే గత చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిన గతే వైఎస్ జగన్ ప్రభుత్వానికి పడుతుందని ఆయన అన్నారు. అది జగన్ ప్రభుత్వం మెడకు చుట్టుకుట్టుందని ఆయన అన్నారు. 

ఏ రాష్ట్రానికి ఇవ్వనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చిందని ఆయన బుధవారం మీడియాతో అన్నారు హోదాకు బదులుగా పథకాలు, ప్రాజెక్టుల ద్వారా రూ.22 వేల కోట్ల నిదులను కేంద్రం ఇచ్చిందని ఆయన చెప్పారు 

ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయమని ఆయన అన్నారు. ఆ విషయం జగన్ కు కూడా తెలుసునని అన్నారు. 

రాజధాని నిర్ణయం విషయంలో రాష్ట్రానికి అధికారం లేదని వితండ వాదన చేస్తున్నారని, ప్రతిపక్షాలు ప్రజలను మభ్య పెట్టే విధానాన్ని మార్చుకోవాలని ఆయన అన్నారు.

అమరావతిని కొనసాగించాలని చెప్పడానికి ప్రధాని మోడీ జగన్ ను నియమించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్రాల పరిధిలోనిదేనని కేంద్రం లోకసభలో స్పష్టం చెప్పిందని ఆయన గుర్తు చేశారు.