అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎదురుదాడికి దిగారు. ప్రకృతి సేద్యంపై చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. 

ట్విట్టర్ వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన సమాధానం ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను చంద్రబాబుకి ట్యాగ్ చేశారు. 

"చంద్రబాబు గారు, నిన్న ప్రెస్ మీట్ లో మీరేదో ఐక్య రాజ్య సమితిలో ఖ్యాతి తెచ్చుకుంటే మేము ఈర్ష్య పడుతున్నాము అన్నారు. ప్రకృతి సేద్యంలో ఏమైనా సాధిస్తే గదా ఖ్యాతి! ఇది కేవలం మీరు చేసుకునే ప్రచారం,ఆత్మస్తుతి మాత్రమే. దానికి మీ పార్టీ పట్ల జాలి తప్ప ఈర్ష్య పడేంతగా ఏమీ సీన్ లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

"చంద్రబాబు గారు,నిన్న ప్రెస్ మీట్ లో మోడీ గారు ఏమి సాధించారుఅన్నారు. మీకిష్టమైన Bloomberg రిపోర్ట్ చదవండి. మన దేశం మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో 6వ పెద్ద ఆర్థిక శక్తి అయ్యింది.IMF ప్రకారం 2022 నాటికీ 4వ పెద్ద ఎకానమీ అవబోతోంది. ఇక మీ అబద్ధాలు ఆపండి" అని ఆయన అన్నారు.