రమణదీక్షితులుకు చంద్రబాబు భయపడుతున్నారా?

GVL questions Nara Chandrababu Naidu on Tirumala issue
Highlights

తిరుమల విషయంలో మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు లేవెనత్తిన విషయాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారనే అభిప్రాయాన్ని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి వ్యక్తం చేశారు.

అమరావతి: తిరుమల విషయంలో మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు లేవెనత్తిన విషయాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారనే అభిప్రాయాన్ని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి వ్యక్తం చేశారు. రమణ దీక్షితులు లేవనెత్తిన విషయాల్లో చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

రమణదీక్షితులుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రమణదీక్షితులును జైల్లో వేసి నాలుగు తగిలేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని సోమిరెడ్జి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించిన విషయాలను ప్రస్తావించిన రమణ దీక్షితుల్ని జైల్లో వేస్తామని బెదిరించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. 

రమణ దీక్షితులుపై సోమిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేత ఆంజనేయరెడ్డి కూడా తప్పుబట్టారు. మంత్రులు కూడా చంద్రబాబు తరహాలోనే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్‌రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలపై బ్రాహ్మణ సేవాసంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమిరెడ్డి వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. 

రమణ దీక్షితులుపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని, లేదంటే తిరుమలలో ఆందోళన చేపడతామని బ్రాహ్మణ సేవాసంఘం హెచ్చరించింది. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. టీడీపీ కుల,  మతపరమైన రాజకీయాలు చేయడం దారుణమని మండిపడింది.

loader