హైకోర్టు విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఢిల్లీలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు అంటే దేశంలో గౌరవం, హోదా ఉన్నటువంటి వ్యవస్థ అని సంస్థ అని దానిని తన ఆఫీసుగా మార్చుకోవాలనుకుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు. తాత్కాలిక హైకోర్టు భవంతిని 12 నెలల్లో కట్టలేకపోవడం చంద్రబాబు చేతికానితనం కాదా అని జీవీఎల్ ప్రశ్నించారు.

హైదరాబాద్‌ను తానే కట్టానని, ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తున్నానని చెప్పిన ముఖ్యమంత్రి రెండంతస్తుల భవనాన్ని కట్టలేకేపోవడం ఏంటీ అంటూ దుయ్యబట్టారు. హైకోర్టును విభజించాలని, డిసెంబర్ 15 నాటికి అమరావతిలో తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని సీఎం చెప్పారని.. మళ్లీ ఇప్పుడు వేరే వాళ్ల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

జనవరి 1న ఏపీలో కొత్త హైకోర్టును ఏర్పాటు చేయాలని అక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించిందని జీవీఎల్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సుప్రీంకోర్టును అవమానించారని, దీనివల్ల హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నరసింహారావు వెల్లడించారు.

అమరావతిలో కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు భవనం వద్ద వసతులు సరిగా లేవని, విభజన కొద్దిరోజుల పాటు నిలిపివేయాల్సిందిగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఒక తీర్మానం చేసిందన్నారు.  న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చుట్టూ సీఎం ప్రదక్షిణలు చేశారని, అలాగే ఏపీకి చెందిన అధికారులు కూడా న్యాయశాఖ చుట్టూ తిరిగారని ఆయన ఎద్దేవా చేశారు.

భవనాలు సిద్ధంగా లేకపోతే కొద్దికాలం వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించి వుండవచ్చు కదా అని నరసింహారావు ఎద్దేవా చేశారు. హైకోర్టు ఏపీలోనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.