న్యూఢిల్లీ: అమరావతిలో భూదందాపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అమరావతిలో భూదందా జరగలేదని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ దందా జరిగిందని తమ పార్టీ మానిఫెస్టోలో కూడా చెప్పామని ఆయన గుర్తు చేశారు. అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆయన అన్నారు.

రాష్ట్ర రాజధాని విషయంలో కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్రాల పరిధిలోనిదని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, కేంద్రం రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. రాజధాని మారినట్లు ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసి, పంపితే కేంద్రం దాన్ని రాజధానిగా గుర్తిస్తుందని ఆయన చెప్పారు. 

అయితే, రైతులు భూములు ఇచ్చారు కాబట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేది తమ వైఖరి అని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తమ పార్టీ రాజకీయ తీర్మానం కూడా చేసిందని ఆయన చెప్పారు. రాజధాని విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన జీవో శిలాశాసనం కాదని, ప్రభుత్వం కొత్త జీవో ఇస్తే కొనసాగుతుందని చెప్పారు. 

రాజధాని నిర్ణయం విషయంలో రాష్ట్రానికి అధికారం లేదని వితండ వాదన చేస్తున్నారని, ప్రతిపక్షాలు ప్రజలను మభ్య పెట్టే విధానాన్ని మార్చుకోవాలని ఆయన అన్నారు.

అమరావతిని కొనసాగించాలని చెప్పడానికి ప్రధాని మోడీ జగన్ ను నియమించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్రాల పరిధిలోనిదేనని కేంద్రం లోకసభలో స్పష్టం చెప్పిందని ఆయన గుర్తు చేశారు.