రెండోసారి... గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫాకు కరోనా పాజిటివ్
గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముస్తపా మరోసారి కరోనా బారినపడ్డారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముస్తపా మరోసారి కరోనా బారినపడ్డారు. గత ఏడాది ఆయనకు తొలిసారిగా కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెండోసారి కూడా ఆయన కరోనా బారినపడ్డారు. స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ఎమ్మెల్యే ముస్తపా తెలిపారు.
గతేడాది కూడా ముస్తఫాకు కరోనా సోకింది. ముస్తఫా సమీప బందువు ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనతో మొత్తం కుటుంబానికి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మొదటిసారి ముస్తఫాకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే ఈ మహమ్మారి నుండి సురక్షితంగా కోలుకున్న ఎమ్మెల్యే తాజాగా రెండోసారి ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయన మళ్ళీ హోంఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలోని మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పంజాబ్ తరహాలోనే ఏపీలోనూ ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 993 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 9,00,805కి చేరుకుంది.
కరోనా కారణంగా గుంటూరు, కృష్ణ, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,213కి చేరుకుంది.గడిచిన 24 గంటల్లో 480 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,86,978కి చేరింది. గత 24 గంటల్లో వ్యవధిలో 30,851 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 1,50,52,215కి చేరుకుంది.
ఒక్కరోజు అనంతపురం 49, చిత్తూరు 179, తూర్పుగోదావరి 29, గుంటూరు 198, కడప 18, కృష్ణా 176, కర్నూలు 37, నెల్లూరు 35, ప్రకాశం 30, శ్రీకాకుళం 45, విశాఖపట్నం 169, విజయనగరం 16, పశ్చిమ గోదావరిలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి.