Asianet News TeluguAsianet News Telugu

ముందస్తు అనుమతి లేదు, క్యాడర్‌ను టీడీపీ నేతలు రెచ్చగొట్టారు : మాచర్ల ఘటనపై డీఐజీ

మాచర్ల ఘటనలో క్యాడర్‌ను టీడీపీ నేతలు రెచ్చగొట్టారని అన్నారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 

guntur range dig trivikram varma comments on macherla violence
Author
First Published Dec 18, 2022, 7:25 PM IST

మాచర్ల ఘటనపై స్పందించారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాచర్ల ఘటనపై పల్నాడు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. అనుమతి లేకుండా టీడీపీ నేతలు కార్యక్రమాలు చేశారని.. ఫ్యాక్షన్ నేపథ్యం వున్న టీడీపీ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని డీఐజీ అన్నారు. ఇరువర్గాలు రాళ్ల దాడులు చేసుకున్నారని.. కేసులు పెట్టామని త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. క్యాడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం టీడీపీ నాయకులు చేశారని.. కార్లు, ఆస్తులపై ధ్వంసం చేశారని కఠిన చర్యలు వుంటాయని డీఐజీ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. 

ఇదిలావుండగా.. మాచర్లలో మరో రెండు రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో  ఉంటుందని  పోలీసులు  ప్రకటించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అలాగే బ్రహ్మారెడ్డిని ఏ1గా చేర్చారు. రేషన్ డీలర్ చల్లా మోహన్ ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రహ్మారెడ్డి, బాబూఖాన్‌లు తమపై రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని చల్లా మోహన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరో రాళ్లు విసిరితే తమపై దాడి చేశారని ఆయన ఫిర్యాదులో చెప్పారు. 

ALso REad: మాచర్లలో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ: మరో రెండు రోజుల పాటు 144 సెక్షన్ అమలు

మరో కేసులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిశోర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పార్టీ కార్యాలయంపై దాడి, కార్ల ధ్వంసం, అపార్ట్‌మెంట్‌లో చొరబడి చేసిన విధ్వంసాల కారణంగా తురక కిశోర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 10 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా తురక కిశోర్, ఏ2గా చల్లా మోహన్‌లను చేర్చారు. ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. 

కాగా... మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేశారు.టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios