Asianet News TeluguAsianet News Telugu

మీకు ఇద్దరు కూతుళ్లున్నారు... వారికే ఇలా జరిగుంటే ఇలాగే స్పందిస్తారా?: జగన్ ను నిలదీసిన లోకేష్ (వీడియో)

ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయిన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన నారా లోకేష్ ను సోమవారం ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం  విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ సీఎం జగన్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

guntur ramya murder... nara lokesh sensational comments on cm ys jagan
Author
Amaravati, First Published Aug 17, 2021, 9:42 AM IST

అమరావతి: దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే దళిత యువతిని హత్య చేశారు... అయినా నేడు జగన్ లేడు‌, గన్ కూడా రావడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన 12 గంటల తర్వాత తీరిగ్గా సీఎం జగన్ స్పందించాడన్నారు. జగన్ రెడ్డికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు... వాళ్లకి ఇలాగే జరిగితే ఆయన ఇలాగే స్పందించే వారా అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య  కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ ను పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేసి సాయంత్రం విడుదల చేశారు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి విడుదలయ్యాక లోకేష్ ఉద్రేకంగా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

''విశాఖ పరిశ్రమలో ప్రమాదం జరిగితే కోటి రూపాయలు ఇచ్చాడు. హడావుడిగా హెలికాప్టర్ లో వెళ్లి మరీ సందర్శించాడు. మరి ఇప్పుడు దళిత యువతిని చంపితే నిర్లక్ష్యంగా మాట్లాడతారా? మహిళలపై దాడులు చేసే హక్కు జగనే ఇచ్చాడు. హోం మంత్రి గారు... ముందు మీ సిఎంని నిలదీయండి'' అని సూచించారు. 

''జగన్  తన చెల్లికే న్యాయం చేయలేదు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కూతురే ప్రాణ రక్షణ లేదని ఆక్రోశిస్తుంది. ఇక సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే మహిలను చంపితే పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల మందిపై దాడులు జరిగాయి. రాష్ట్రం మొత్తం పర్యటించి బాధిత కుటుంబాలను కలుస్తాం'' అని లోకేష్ వెల్లడించారు. 

read more  ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి నారా లోకేష్ విడుదల

''ఓ మంత్రి నీ యమ్మ మొగుడు అంటూ సిగ్గు లేకుండా మాట్లాడతాడు. మీ ఇంట్లో మహిళలను కూడా ఇలాగే పిలుస్తారా? ప్రజల తరపున మేము పోరాటం చేస్తుంటే... సోషల్ మీడియా లో అసభ్యంగా పోస్ట్ లు పెడతారు. గన్ లేని జగన్ సిఎం అయ్యాకే ఎపిలో దాడులు పెరిగి పోయాయి'' అని మండిపడ్డారు. 

''అధికార పార్టీ నేతలు నిందితులకు కాపలా కాస్తున్నారు. దిశ చట్టం కింద ఒక్కరికైనా శిక్ష వేశారా జగన్ రెడ్డి. మీ సొంత పేపర్ కి దిశ పేరుతో ముప్పై కోట్లు యాడ్స్ మాత్రం ఇచ్చుకున్నారు. మీ సొంత ఎంపి మాధవ్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకే దిశపై కేంద్రం ఎలా స్పందించిందో చూసుకోండి'' అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. 

వీడియో

''రమ్యశ్రీని అతి దారుణంగా చంపడం చాలా బాధాకరం. ప్రభుత్వం స్పందించిన తీరు కూడా చాలా బాధ కలిగించింది. ప్రభుత్వ యంత్రాంగం పది లక్షలు ప్రకటించి బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. పది లక్షల తో చెల్లెల్ల ప్రాణానికి విలువ కడతారా? నరసరావుపేటలో అనూషను చంపిన వారు బెయిల్ పై బయట తిరుగుతున్నారు'' అని ఆవేధన వ్యక్తం చేశారు. 

''మేము పరామర్శకి వెళ్లి బయటకు వచ్చాక వైసిపి రౌడీలు మా మీదకు వచ్చారు. మా పార్టీ మహిళలను దుర్భాషలాడారు.. నీచంగా మాట్లాడారు. పోలీసులు వారిని వదిలేసి మా నాయకులను అరెస్టు చేస్తారా? ఆడవాళ్లు, మాజీ మంత్రులను ఈడ్చుకెళతారా? మా మీద పెట్టిన సెక్షన్ లు ఏమిటో పోలీసులకు కూడా తెలియలేదు'' అన్నారు. 

''ప్రభుత్వానికి ఇరవై రోజుల సమయం ఇస్తున్నాం. దిశ చట్టం కింద రమ్యశ్రీ కేసులో నిందితునికి శిక్ష పడాలి. లేదంటే 21వ రోజు భారీ పోరాటానికి శ్రీకారం చుడతాం. ఈరోజు జరిగిన ఘటనపై కోర్టు కూడా న్యాయ పోరాటం చేస్తాం. పోలీసుల బాడీ కెమెరాలు పరిశీలించి చర్యలు తీసుకోండి'' అని లోకేష్ హెచ్చరించారు. 

''రమ్యశ్రీ కుటుంబ సభ్యల కోరిక మేరకే మేము అక్కడికి వెళ్లాం. జగన్ రెడ్డి చేతకానితనం వల్లే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుంది. టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టె శ్రద్ద అమ్మాయిల రక్షణలో చూపించడం లేదు. పోలీసులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా కేసులు పెడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తే ప్రజలే బుద్ది చెబుతారు'' అని లోకేష్ హెచ్చరించారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios