అమరావతి: రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలోనే ప్రజలకు  చంద్రబాబునాయుడు గుర్తుకు వస్తారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడులాంటి ముఖ్యమంత్రి అవసరమని ప్రజలు గుర్తిస్తారన్నారు. 

శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పలు విషయాలను చెప్పారు.  విజయవాడలో టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  గత ఎన్నికల్లో ఓటమిపై పోటీచేసిన అభ్యర్ధులతో చంద్రబాబునాయుడు చర్చించారు.

ఈ సమావేశంలో పలువురు అభ్యర్థులు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారని  గల్లా జయదేవ్ గుర్తు చేశారు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు  తోడయ్యాయో.... రాష్ట్రంలో టీడీపీ ఓటమికి కూడ అనేక కారణాలు కూడ కారణమయ్యాయని సమావేశంలో నేతలు వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.

ఈ సమావేశం తర్వాత పలు తీర్మాణాలను చేయనున్నట్టు చెప్పారు. ఈ వివరాలను మీడియాకు వివరిస్తామన్నారు.కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టిన సమయంలో  మోడీని  ఎదిరించిన వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మొదటి వాడని జయదేవ్  గుర్తు చేశాడు. 

ఇటీవల  పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో నాని బాగా హర్ట్ అయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై నానితో  చర్చిస్తున్నామన్నారు. నాని పార్టీని వీడరని ఆయన  స్పష్టం చేశారు.