ఇటీవల గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసు మరో మలుపు తిరిగింది. యువతి ఆత్మహత్యకు కారణమైన యువకున్ని మరికొద్ది నిమిషాల్లో పెళ్లిపీటలెక్కుతాడు అనగా అరెస్ట్ చేసారు పోలీసులు. 

గుంటూరు: ఇటీవల గుంటూరు జిల్లాలోని ఓ కాలేజీ భవనం పైనుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపిన విషయం తెలిసిందే. యువతి ఆత్మహత్యకు ప్రేమవ్యవహారమే కారణమని తేలడంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఓ యువతిని వంచింది మరో యువతితో పెళ్లికి సిద్దమై పెళ్లిపీటలపై వుండగా మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు యువకున్ని అరెస్ట్ చేసారు. దీంతో పెళ్ళి ఆగిపోయింది.

వివరాల్లోకి వెళితే... చేబ్రోలు మండలం పాతరెడ్డి పాలెంకు చెందిన కావ్య డిగ్రీ చదువుతోంది. తన గ్రామానికే చెందిన పవన్ కుమార్ అనే యువకుడు ఆమెను ప్రేమపేరుతో వెంటపడి మాయమాటలతో నమ్మించాడు. ఇలా ఒకరంటే ఇకరు ఇష్టపడటంతో కొంతకాలం వీరిప్రేమ హాయిగా సాగింది. అయితే కావ్య పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చేసరికి పవన్ తీరులో మార్పు వచ్చింది. ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. 

ఈ క్రమంలోనే పవన్ మరో అమ్మాయితో పెళ్లికి సిద్దమయ్యాడు. ఇదేంటని కావ్య నిలదీయగా ప్రేమ పెళ్లి సాధ్యంకాదని... అందుకే పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటున్నానని తేల్చిచెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన కావ్య బలవన్మరణానికి సిద్దమయ్యింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లిన ఆమె పరీక్షాకేంద్రంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలేజీ భవనం రెండో అంతస్తు నుండి దూకింది.

కాలేజీ సిబ్బంది వెంటనే కావ్యను గుంటూరు జిజిహెచ్ కు తరలించారు. భవనం పైనుండి దూకినా చిన్నచిన్న గాయాలే కావడం, సరైన సమయంలో మెరుగైన చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. యువతి ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రేమపేరుతో పవన్ మోసం చేసాడని... అందువల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కావ్య తెలిపింది. 

మరోవైపు కావ్య ఆత్మహత్యాయత్నం గురించి తెలియడంతో పవన్ హడావిడిగా పెళ్ళికి సిద్దమయ్యాడు. తుళ్ళూరు మండలం ఆలపాడుకు చెందిన మాధవి తో అతడికి పెద్దలు వివాహం నిశ్చయించాడు. పెద్దమొత్తంలో కట్నకానుకలు కూడా అమ్మాయి కుటుంబం పవన్ తల్లిదండ్రులకు ఇచ్చింది. వరుడి ఇంటివద్ద పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వధూవరులిద్దరు మరికొద్దిసేపట్లో పెళ్లిపీటలపైకి చేరుకుంటారనగా పవన్ ను అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లికొడుకు అరెస్ట్ విషయం తెలిసి వధువు బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు పవన్ ప్రేమ వ్యవహారం, యువతి ఆత్మహత్యాయత్నం గురించి తెలపడంతో వధువు బందువులు ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నారు. ముందుగానే ఇచ్చిన కట్నకానుకలు వరుడి తల్లిదండ్రుల నుండి వధువు కుటుంబసభ్యులు తీసేసుకుని వెళ్లిపోయారు.

ఓ యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆత్మహత్యకు కారణమై మరో యువతిని పెళ్ళాడేందుకు సిద్దమైన పవన్ కు కఠినంగా శిక్షించాలని ఇరువురు అమ్మాయిల కుటుంబాలు కోరుతున్నాయి. ప్రేమ పేరుతో వంచించే మోసగాళ్ల బారిన పడొద్దని పోలీసులు అమ్మాయిలకు సూచిస్తున్నారు. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)