Asianet News TeluguAsianet News Telugu

పవర్ స్టార్ సినిమాతో వైసిపికి సంబంధం లేదు..: గుడివాడ అమర్నాథ్

చంద్రబాబును పట్టుకుని వెళితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే... ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇంకా తెలుసుకోకపోవడం భాదగా ఉందన్నారు వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. 

gudiwada amarnath fires on pawan kalyan
Author
Visakhapatnam, First Published Jul 24, 2020, 8:46 PM IST

విశాఖపట్నం: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన పార్టనర్స్‌ కలిసి విశాఖను రాజధానిగా కాకుండా ఏ రకంగా అడ్డుకోవాలా అని చేస్తున్న కుట్రలను, విషప్రచారాన్ని గమనిస్తూనే వున్నామని వైఎస్సార్ సిపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ కి విశాఖపట్టణం ఏం చేసిందో, ఎలా ఆదరించిందో, ఎలా అవకాశాలు ఇచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇంతచేస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉంది తాజాగా ఆయన స్పందిస్తున్న తీరు చూస్తుంటే అని మండిపడ్డారు. 

''పవన్ కల్యాణ్ ఇంకా చంద్రబాబు ఫోల్డర్ నుంచి బయటపడినట్లుగా లేరు. నేను రెండు చేతులు జోడించి ఒకటే కోరుతున్నా... మీరు ఈ రకంగా అడ్డుకోవడం మంచిది కాదు.పవన్‌ కళ్యాణ్‌ ను ప్రజలు ఛీకొట్టినా, రెండు ప్రాంతాల్లో ఓడించినా మారలేదు, ఇంకా ఆయనకు సిగ్గురాలేదు. మీరు ఎందుకు ఇంకా చంద్రబాబును పట్టుకు ఊరేగుతున్నారు..?'' అని అడిగారు. 

''చంద్రబాబును పట్టుకుని వెళితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇంకా తెలుసుకోకపోవడం భాదగా ఉంది. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ప్రకటన ఏదైతే జగన్‌మోహన్‌రెడ్డి చేశారో దానిని అడ్డుకునేటువంటి అవకాశం కానీ, సాహసం కానీ ఎవరు చేసినా ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. జగన్‌ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో వెనకడుగు వేసే అవకాశం లేదని ప్రజలందరికీ తెలుసు'' అని అన్నారు. 

''ఈ రోజు రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఏ రోజైతే ముఖ్యమంత్రి విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించారో ఆ రోజు నుంచి జరుగుతున్న విషప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు, ఆయన పార్టనర్స్‌ కలిసి విశాఖను రాజధానిగా కాకుండా ఏ రకంగా అడ్డుకోవాలా అని చేస్తున్న కుట్రలను, విషప్రచారం చూస్తున్నాం'' అని అన్నారు. 

read more  జగన్ కోసం, జగన్ చేత, జగన్ కొరకు... ఇది జగన్‌స్వామ్యం: యనమల ఎద్దేవా

''పవన్‌కళ్యాణ్‌ సినీ పాఠాలు నేర్చుకుంది ఇక్కడే. ఆయనకు పిల్లనిచ్చి దాంపత్య జీవితాన్నిచ్చి కల్పించింది విశాఖే.  అల్లుడిగా ఎంతో ఆదరించింది. కానీ తాజాగా ఆయన స్పందిస్తున్న తీరు చూస్తుంటే...చంద్రబాబు ప్రేమ నుంచి ఇంకా బయటపడినట్లుగా లేరని అర్థమవుతుంది. మీకు అనేక అవకాశాలు ఇచ్చిన విశాఖకు  గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చేలా మంచి చేయాలి, మేలు చేయాలని ఒక నాయకుడు ప్రయత్నిస్తుంటే మీరు ఈ రకంగా అడ్డుకోవడం మంచింది కాదు'' అని పవన్ కల్యాణ్ కు సూచించారు. 

''చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ను పవన్ కళ్యాణ్ చదవడం...ఆయన సొంత పిఏ హరిప్రసాద్‌ ఆయన్ను ప్రశ్నలడగడం, ఈయన సమాధానాలు చెప్పడం చూస్తుంటే..   మీకు ఇంకా సిగ్గురాలేదని అర్థమవుతుంది. మహానుభావుల తాలుకూ ఆలోచనలు ఆశయాలు పాటించండి కానీ ఇలాంటి వ్యక్తులవి కాదు. ఇప్పటికే సమాజానికి మీ ఆలోచనాతీరు, వ్యవహారశైలి అర్ధమైపోయింది. నిన్న మీ ఇంటర్వూ చూసిన తర్వాత ఇంకా మీరు ఎలా నటించగలుగుతున్నారో మాకు అర్ధం కావడం లేదు. ఒకసారి ప్రజలు ఛీకొట్టి, తిరస్కరించినా మీరు ఏరకంగా ఇంకా నటించగలుగుతున్నారు'' అని విమర్శించారు. 

''మీకు సంబంధించినటువంటి విషయంపై డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ ఓ సినిమా తీసి, ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తే మా పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీరు సినిమా వారు, ఏం తీసుకుంటే అది తీసుకోండి. మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు'' అని  అమర్నాథ్ పేర్కొన్నారు. 

''ఎన్నో సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతానికి ఇంతకాలానికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు జగన్. ఆయన అధికారంలోకి వచ్చినందుకు ప్రజలు ఆనందపడుతున్న సమయంలో మీరు ఎలాగోలా దీనిని అడ్డుకోవాలనుకోవడం దారుణం.స్టేట్‌ కోసం జగన్‌ ఆలోచిస్తుంటే రియల్‌ ఎస్టేట్‌ కోసం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అలాంటి వ్యక్తితో ఊరేగి ఇప్పటికే మీ పరువు మీరు తీసుకున్నారు. ఇకనైనా దయచేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు వ్యవహరించకపోతే ఈ ప్రాంత ప్రజలు మీరు తిరిగేందుకు కూడా అవకాశం ఇవ్వరు'' అని పవన్ కళ్యాణ్ ను అమర్నాథ్ హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios