గుడివాడలో ‘క్రిస్మస్’ రాజకీయం.. కానుకల పంట.. ఇప్పుడే ఇలా ఉంటే..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలించే వారికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Gudivada Christmas politics Venigandla Ramu entry change the picture

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలించే వారికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రస్తుతం వైసీపీ నేత కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన కొడాలి నాని.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. పదేళ్లుగా వైసీపీలోనే కొనసాగుతున్నారు. గుడివాడలో కొడాలి నానికి తన సొంత సామాజిక వర్గం‌తో (కమ్మ), వైసీపీకి మద్దతుగా ఉండే ఎస్సీ, క్రిస్టియన్ వర్గాల నుంచి సపోర్ట్ ఉంది. టీడీపీ నేతలపై, ముఖ్యంగా చంద్రబాబు  నాయుడు, నారా లోకేష్‌లపై విమర్శలు చేయాలంటే కొడాలి నాని ముందుంటారు. నందమూరి ఫ్యామిలీ నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్నారని ఆరోపించే నాని.. జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా కూడా కామెంట్స్ చేస్తుంటారు. ఇది టీడీపీకి చాలా సందర్భాల్లో ఇబ్బందికరంగా మారింది.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి  ఓడిపోయిన దేవినేని అవినాష్.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. దీంతో అక్కడ చంద్రబాబు టీడీపీ నుంచి ఎవరిని బరిలో నిలుపుతారనే చర్చ సాగుతుంది. అయితే కొంతకాలంగా గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్గ్ గా ఉంటున్న రావి వెంకటేశ్వరరావు.. తానే అభ్యర్ధి అని ప్రచారం చేసుకుంటున్నారు. కొడాలికి వ్యతిరేకంగా గుడివాడలో టీడీపీ రాజకీయాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా గుడివాడ టీడీపీ అభ్యర్థి రేసులో మరోపేరు వినిపిస్తోంది. ఆయనే.. పారిశ్రామికవేత్త ఎన్నారై వెనిగండ్ల రాము. చంద్రబాబు కూడా గుడివాడ నుంచే రామును బరిలో దించాలని ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. తద్వారా కొడాలి నానికి మద్దతుగా ఉన్న కమ్మ, దళిత, క్రిస్టియన్ ఓటు బ్యాంకు టీడీపీ వైపు మళ్లుతుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

రాము విషయానికి  వస్తే.. గుడివాడకు వెనిగండ్ల రాము కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాము విదేశాల్లో స్థిరపడ్డారు. ఇక, రాము ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య దళిత సామాజికి వర్గానికి చెందినవారు. అలాగే క్రిస్టియన్ కూడా. రాము భార్య తండ్రి పాస్టర్‌గా గుడివాడ ప్రాంతంలో పని చేస్తున్నాడు. ఆయనకు గుడివాడ నియోజకవర్గంలోని క్రిస్టియన్స్‌లో మంచి పేరు, గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే గుడివాడ అంతటా రాముకు మంచి సంబంధాలు ఉన్నాయి. 

గుడివాడ నుంచి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్న రాము.. ఇక్కడకు తిరిగి వచ్చి సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించి.. ప్రజాసేవ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సమస్యల పరిష్కారానికి సొంత డబ్బు ఖర్చుపెట్టేందుకు ఆయన ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సామాజికవర్గాల వారీగా మద్దతు కూడట్టేందుకు కానుకలను కూడా పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాను గుడివాడ నుంచి బరిలో నిలిస్తే.. ఇటు కమ్మ  సామాజిక వర్గంతో పాటు క్రిస్టియన్, దళిత వర్గాల మద్దతు ఉంటుందని రాము లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 

అయితే ఇప్పుడు క్రిస్మస్‌ వేడుకల ద్వారా పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. రాము తన మామ సాకారంతో పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించడంతో పాటు.. మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు. ఈ చీరలు కూడా మాములువి కావని.. వెయ్యి రూపాయలకు పైగా ఖరీదుతో కూడుకున్నవనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మహిళలకు చీరలు, స్వీట్ బాక్కుల పంపిణీ పూర్తైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు రావి వెంకటేశ్వరరావు మద్దతు కూడా పొందేందుకు రాము ప్రయత్నాలు  చేస్తున్నట్టుగా టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

అయితే ఈ క్రమంలోనే నియోజకవర్గంలో క్రిస్మస్ పండగ పేరుతో రాజకీయం మొదలైంది. రాము క్రిస్మస్ కానుకల నేపథ్యంలో మిగిలిన వారు పోటీగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. టీడీపీ టికెట్‌పై ఆశలు పెట్టుకన్న రావి వెంకటేశ్వరరావు కూడా శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఆయన కూడా ఉచితంగా బహుమతులను పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది.

ఈ పరిణామాలపై కొడాని నాని కూడా అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో చాలా గ్రాండ్‌గా సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఆదివారం రాత్రి లింగవరంలోని కె కన్వెన్షన్‌ల వైసీపీ తరపున  సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జోగిరమేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. 

ఈ పరిణామాల గమనిస్తే.. వేర్వురు సెమీ క్రిస్మస్ వేడుకలతో గుడివాడలో క్రిస్మస్ పండగ పేరుతో రాజకీయ నడుస్తోందనే మాట వినిపిస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే గుడివాడలో పరిస్థితులు ఈ విధంగా ఉంటే.. ఎన్నికల నాటికి ఇక్కడ పోరు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం లేకపోలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios