విశాఖపట్నం: ఇ ఇంట్లో పెళ్లి బాజాలు మెుదలయ్యాయి. అమ్మాయి తరుపు వారు, అబ్బాయి తరుపు వారి బంధువులతో కళ్యాణ మండపం సందడిగా మారింది. మరికాసపేట్లో తనకు పెళ్లి జరగబోతుందని పెళ్లికుమార్తె సంబరపడుతోంది. 

తమ కూతురు వివాహం చేస్తున్నందుకు పెళ్లికుమార్తె తల్లిదండ్రలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సీన్ కట్ చేస్తే పెళ్లికుమారుడు పరారయ్యాడు. దీంతో పెళ్లికుమార్తె తరుపు బంధువుల కుటుంబం బోరున విలపించింది. కుమార్తెను చూసి తల్లిదండ్రులు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ఘటన విశాఖపట్నం జిల్లా మల్కాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న 28ఏళ్ల కృష్ణకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. బుధవారం రాత్రి వీరి వివాహానికి ఇరుకుటుంబాల పెద్దలు ఏర్పాట్లు చేశారు.

 శ్రీహరిపురం యారాడ పార్కు సమీపంలోని కళ్యాణ మండపంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. భోజనాలు కూడా చేశారు. మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమారుడు కృష్ణ అదృశ్యమయ్యాడు. దీంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆందోళన చెందారు. 

కళ్యాణమండం, అతడి నివాసం ఎంత వెతికినా కనిపించలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ అని రావడంతో పెళ్లికుమారుడు పరారయ్యాడని గమనించారు. కృష్ణకు ఓ యువతితో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోందని తెలిసింది. 

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లి పీటల నుంచి పరారీ అయినట్టు తెలియడంతో వధువు తరుపు బంధువులు మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి పీటల నుంచి వరుడు పరారైనట్లు తమకు సమాచారం వచ్చిందని అయితే ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.