ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఇంట్లో వాళ్లకు ఎవరికీ తెలియకుండా బాలికను తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రికి రాత్రి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రంతా ఆ బాలికతోనే గడిపి..  ఉదయాన్నే ఆమెకు అక్కడ వదిలేసి పరారయ్యాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పోలాకి మండలానికి చెందిన ఓ బాలిక ఇంటర్ విద్యనభ్యసిస్తోంది. ప్రతి రోజూ సైకిల్ మీద కాలేజీకి వెళ్లేది. కాగా... బాలిక కాలేజీకి వెళ్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమె వెంట పడేవాడు. ప్రమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అతని మాటలను యువతి కూడా నిజమని నమ్మేసింది. నాలుగు నెలలుగా వెంట పడటంతో... అతనిని నమ్మి ఇంట్లో ఎవరికీ తెలియకుండా గురువారం రాత్రి అతనితోపాటు వెళ్లిపోయింది. అక్కడి నుంచి యువకుడు బాలికను ఓ గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రంతా బాలికతో గడిపాడు. ఉదయం బాలిక నిద్ర లేచి చూసేసరికి యువకుడు పరారయ్యాడు.

చాలా సేపు ఎదురుచూసినా రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాలిక వెంటనే ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలియజేసింది. వారి సహాయంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.