పెళ్లిబాజా మోగాల్సిన ఇంట కరోనా మహమ్మారి చావుబాజా మోగించిన విషాద సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.  

విశాఖపట్నం: మరో మూడురోజుల్లో పెళ్లి. ఇంట్లో పెళ్లిసందడి మొదలయ్యింది. ఇలా ఆనందంతో నిండిపోయిన ఇంట్లో ఒక్కసారిగి విషాదం చోటుచేసుకుంది. పెళ్లికొడుకే కరోనాబారిన పడి మృతి చెందడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. ఇలా పెళ్లిబాజా మోగాల్సిన ఇంట చావుబాజా మోగింది. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్‌ కు రోలుగుంట మండలం ఆర్ల గ్రామానికి చెందిన మేనమామ కూతురితో వివాహం నిశ్చయమయ్యింది. మరో మూడురోజుల్లో అంటూ ఈనెల 26వ తేదీన వీరి వివాహం జరగాల్సి వుంది. పెళ్ళికి అంతా సిద్దం చేసుకున్నారు.

read more ఏపీలో కాస్త శాంతించిన కరోనా: కొత్తగా 18,767 కేసులు.. చిత్తూరులో మృత్యుఘోష

ఇంతలోనే దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు రజనీకాంత్ కు జ్వరం రావడంతో నర్సీపట్నంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయ్యింది. దీంతో అక్కడే చికిత్స పొందుతున్న అతడి ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ అతడు మరణించాడు. 

ఇలా మరికొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు పాడె ఎక్కడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సరైన సమయంలో వైద్యం అందించివుంటే తన బావ బ్రతికేవాడని పెళ్లి కుమార్తె బోరున విలపిస్తోంది.