శ్రీకాకుళం: ఆస్తి కోసం సొంత తాతను మనవళ్లే అతి కిరాతకంగా హతమార్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. తాతయ్య అన్న ప్రేమే కాదు వృద్ధుడు అన్న జాలి కూడా చూపించకుండా సొంతవాళ్లే తుపాకీతో కాల్చి చంపారు. 

వివరాల్లోకి వెళితే పారిగ కమలొ(85) మందస మండలం చికిడిగాం గ్రామంలో నివాసముంటున్నాడు. అతడికి ముగ్గురు కూతుళ్ళు ఓ కొడుకు సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా వున్నారు. అయితే ప్రస్తుతం వృద్ధాప్యం కారణంగా కమలొ నడవలేని పరిస్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. దీంతో అతడి పేరుమీద వున్న ఏడెకరాల భూమిపై కుటుంబసభ్యులు మరీ ముఖ్యంగా మనవల కన్ను పడింది. 

అయితే ప్రస్తుతం కమలో కూతురు వద్ద వుంటున్నాడు. దీంతో ఎక్కడ తన పేరుమీద వున్న భూమిని అతడు కూతురికి రాసిస్తాడోనన్న భయం కొడుకు, మనవలకు పట్టుకుంది. దీంతో దారుణానికి ఒడిగట్టారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి నాటు తుపాకీతో తాతను కాల్చి చంపారు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ లను తీసుకువచ్చి ఆదారాలను సేకరించారు. క్లూస్, క్రైమ్‌ టీమ్‌లు ఘటనా స్థలంలో బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.