మున్సిపల్ స్కూళ్ళ నుండి తెలుగు మాధ్యమాన్ని ఎత్తేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించలేదు. ఉత్తర్వులు మున్సిపల్ శాఖ జారీ చేసింది. మున్సిపల్ శాఖకు మంత్రి పి. నారాయణ అన్నది అందరికీ తెలిసిందే. మున్సిపల్ స్కూళ్ళను మెల్లిగా మూసేసి ఆ విద్యార్ధులందరినీ కార్పొరేట్ స్కూళ్ళకు తరలించాలన్న కుట్ర జరుగుతోందని విద్యార్ధి సంఘాలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదో ఒకరకంగా ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల నుండి తెలుగుభాషను తరిమేయాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లే ఉంది. అందుకు అవసరమైన ఉత్తర్వులను కూడా గతంలో జారీ చేసింది. అయితే, అన్నీ వర్గాల నుండి వచ్చిన విమర్శలకు భయపడి ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అయితే, అప్పట్లో ఉత్తర్వులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు లేకుండానే తన నిర్ణయాన్నిఅమలు చేస్తోంది.
ప్రభుత్వ పాఠశాల నుండి ఎలాగైనా తెలుగును తరిమేయాలన్న గట్టి నిర్ణయంతో ప్రభుత్వం అడుగులేస్తోంది. అన్నీ పాఠశాలల్లో ఒకేసారి అమలు చేస్తే గొడవలొస్తాయని భావించిన ప్రభుత్వం ముందుగా మున్సిపల్ స్కూళ్ళను ఎంచుకుంది. మున్సిపల్ స్కూళ్ళకు తెలుగు మాధ్యమం పుస్తకాల సరఫరాను ఆపేసింది. జూన్ 12వ తేదీనే స్కూళ్ళు తెరిచినా ఇంత వరకూ పిల్లలకు తెలుగు పుస్తకాలు అందలేదంటే ఏంటర్ధం? పుస్తకాలు లేకపోతే టీచర్లు పాఠాలు ఎలా చెబుతారు? పిల్లలు ఏం చదువుతారు? ఈమాత్రం ప్రభుత్వానికి తెలీదా? అయినా కావాలనే ప్రభుత్వం తెలుగు పుస్తకాలను సరఫరా చేయలేదన్నది వాస్తవం.
రాష్ట్రంలో 2,199 మున్సిపల్ స్కూళ్ళున్నాయి. ఒకటి నుంచి 10వ తరగతి వరకు 5 లక్షల మందికి పైగా విద్యార్ధులు చదువుకుంటున్నారు. మున్సిపల్ స్కూళ్లంటేనే తెలుగు చదవే విద్యార్ధులన్న విషయం ప్రభుత్వానికి తెలీదా? తెలుగు చదవు అవకాశం లేక, ఇంగ్లీష మాధ్యమాన్ని చదవలేక విద్యార్ధులు మధ్యలోనే చదువుమానేస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందా? అంటే విద్యార్ధులు లేరని పాఠశాలలు మూసేయటమేనా ప్రభుత్వ వ్యూహం?
విచిత్రమేమంటే మున్సిపల్ స్కూళ్ళ నుండి తెలుగు మాధ్యమాన్ని ఎత్తేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించలేదు. ఉత్తర్వులు మున్సిపల్ శాఖ జారీ చేసింది. మున్సిపల్ శాఖకు మంత్రి పి. నారాయణ అన్నది అందరికీ తెలిసిందే. మున్సిపల్ స్కూళ్ళను మెల్లిగా మూసేసి ఆ విద్యార్ధులందరినీ కార్పొరేట్ స్కూళ్ళకు తరలించాలన్న కుట్ర జరుగుతోందని విద్యార్ధి సంఘాలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
