కరోనాతో పాఠశాల హెడ్ మాస్టర్ నాయుడు వీర రాఘవేంద్రరావు మృతి

ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాయుడు వీర రాఘవేంద్ర రావు కరోనా వ్యాధికి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఆయన మృతికి బంధువులు, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.

Govt school HM Veera raghavendra Rao dies with Coronavirus

గుంటూరు: కరోనాతో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మృతి చెందాడు.  వివరాలలోకి వెళితే...  గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన నాయుడు వీర రాఘవేంద్రరావు (55) పెదకాకాని మండలం ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.  

ఈ  నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన ఆయనను చికిత్స నిమిత్తం  కుటుంబ సభ్యులు  గత నెల 24వ తేదీన  గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  చేర్పించారు.  అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రధానోపాధ్యాయుడు వీర రాఘవేంద్రరావు సోమవారం అర్థరాత్రి మృతి చెందారు. 

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు వీర రాఘవేంద్రరావు  మృతికి బంధువులు,  ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, తిరుమల శ్రీవారి మాజీ ప్రదానార్చకుడు నారాయణ దీక్షితులు కరోనా వైరస్ తో మరణించారు. నారాయణ దీక్షితులు మృతికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదిలావుంటే, సోమవారం సాయంత్రం వెలువడిన బులిటెన్ ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 11 లక్షల 63వేల 994 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో 71 మంది మరణించారు. 

తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9మంది చొప్పున మరణించారు.అనంతపురం,కర్నూల్ జిల్లాల్లో ఏడుగురు చొప్పున చనిపోయారు.ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరులో ఐదురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 8207కి చేరుకొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios