చంద్రబాబు చాలా కాస్ట్లీ

First Published 15, Nov 2017, 8:10 PM IST
Govt releases Rs 7 Lakhs for Naidus houses
Highlights
  • ప్రభుత్వ డబ్బును ఖర్చుచేయటంలో చంద్రబాబునాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.

ప్రభుత్వ డబ్బును ఖర్చుచేయటంలో చంద్రబాబునాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. అసలే ఆంధ్రప్రదేశ్‌ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటూ ఒకవైపు ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు మీడియా ముందు బీద అరుపులు అరుస్తున్నారు.. ఇంకోవైపు రైతులు రుణమాఫీ అమలుకాక అన్నదాత, అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటేంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. ప్రజా సంక్షేమం కోసం నిధులను విదల్చని ముఖ్యమంత్రి, స్వప్రయోజనాలకు మాత్రం యధేచ్ఛగా ఖర్చుపెడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి స్వప్రయోజనం కోసం ప్రజల సొమ్మును మరోసారి యధేఛ్చగా ఖర్చుపెట్టారు. ఆయన సొంత ఇంటి నిర్వహణ ఖర్చులకు రూ.7.50 లక్షలు మంజూరయ్యాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.65లో ఇటీవలే నిర్మించిన ఇంట్లో, నీటి సరఫరా, శానిటరీ పనులతో పాటు, మదీనాగూడలోని సొంత ఫాంహౌస్‌కు భద్రత, నిర్వహణకు ఈ  నిధులను మం‍జూరు చేసారు. ముఖ్యమంత్రి సౌకర్యార్థం నిధులు ఖర్చు చేయటంలో తప్పులేదు. ప్రభుత్వ అతిథిగృహమో లేకపోతే క్యాంపు కార్యాలయ నిర్వహణకో ఖర్చు చేసినా అర్థం ఉంటుంది. ఇలా సొంత ఇళ్ళకు కూడా ప్రజల సొమ్మును ఖర్చు చేయటమేంటో? హైదరాబాద్ లో ఇళ్ళు కాకుండా కృష్ణానది కరకట్టపై చంద్రబాబుకు క్యాంపు ఆఫీసుంది. మళ్ళీ విజయవాడలో ఇంకో క్యాంపు కార్యాలయముంది. అన్నింటికీ ప్రభుత్వ ఖర్చే. ఇలా ఖర్చులు చేసుకుంటూ పోతే అప్పులు కాక మరేం మిగులుతుంది ?

loader