Asianet News TeluguAsianet News Telugu

నంద్యాల ఎఫెక్ట్: డ్వాక్రా బకాయిలు చెల్లింపుకు నిర్ణయం

  • బకాయిల చెల్లింపుపై డ్వాక్రా సంఘాల మహిళలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
  • దాంతో మంత్రి కూడా విషయ తీవ్రతను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు.
  • నంద్యాల పరిస్ధితిని వివరించారట ప్రత్యేకంగా.
  • దాంతో రాబోయే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని గురువారం రాత్రి రూ. 676 కోట్ల వడ్డీ బకాయిలు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు.
Govt feeling the heat of dwacra women in the wake of namdyala by poll

నంద్యాల ఉపఎన్నిక ఎఫెక్ట్ చంద్రబాబునాయుడుపై బాగానే పడింది. డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ రుణాల చెల్లింపు బకాయింపులకు రూ. 676  కోట్లు విడుదల చేయటమే అందుకు నిదర్శనం. సరే, చెల్లించాల్సింది చాలా ఉన్నా ఈమాత్రమన్నా విడుదలైందంటే నంద్యాల ఉపఎన్నిక మహత్యమే అనుకోవచ్చు. నిధుల విడుదల కోసం నారా లోకేష్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటిస్తున్నా డ్వాక్రా మహిళల సెగ బాగా తగులుతోంది.

బకాయిల చెల్లింపుపై డ్వాక్రా సంఘాల మహిళలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దాంతో మంత్రి కూడా విషయ తీవ్రతను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. నంద్యాల పరిస్ధితిని వివరించారట ప్రత్యేకంగా. దాంతో రాబోయే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని గురువారం రాత్రి రూ. 676 కోట్ల వడ్డీ బకాయిలు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు.

ఇటీవలే వైసీపీ నిర్వహించిన ప్లీనరీలో డ్వాక్రా సంఘాల కోసం వైఎస్ జగన్ ప్రకటించిన ‘వైఎస్సార్ ఆసరా’ పథకంపైన కూడా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డ్వాక్రా సంఘాలకు రూ. 15 వేల కోట్లు విడుదల చేస్తానంటూ చేసిన ప్రకటనపై మంత్రులు ఓవైపు మండిపడుతూనే ఇంకోవైపు ప్రభుత్వ తీరుపై డ్వాక్రా మహిళల్లో పేరుకుపోతున్న అసంతృప్తిని వివరించారట. దాంతో తప్పని పరిస్ధితిల్లో చంద్రబాబు వడ్డీ బకాయిల క్రింద 2015-16 సంవత్సరాలకు గాను రూ. 676 కోట్లు తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జరీ చేసారు.

టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. దాంతో అప్పటి వరకూ తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించకపోవటంతో వడ్డీలు, బకాయిలూ పేరుకుపోయాయి. దాంతో బ్యాంకులు లక్షలాదిమంది డ్వక్రా మహిళలను డిఫాల్టర్లుగా ప్రకటించాయి. మొత్తం మహిళలు చెల్లించాల్సిన వడ్డీ రూ. 1500 కోట్లుండగా ఇపుడు విడుదల చేసింది కేవలం రూ. 676 కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ. 824 కోట్లు బకాయిలున్నాయన్నమాట. నంద్యాల ఉపఎన్నిక ఫలితం కూడా డ్వాక్రా సంఘాల మొగిలిన బకాయిల చెల్లింపుపై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం లేదు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా సంఘాల బకాయిలు రూ. 14 వేల కోట్లు. రుణమాఫీ ప్రకటించినప్పటి నుండి సంఘాలు వడ్డీని కట్టడం మానేసాయి. అంటే కట్టాల్సిన వడ్డీ రూ. 1400 కోట్లు. మొత్తం చెల్లించాల్సింది రూ. 15,400 కోట్లన్నమాట. ప్రభుత్వం గడచిన మూడేళ్ళలో డ్వాక్రా సంఘాల తరపున బ్యాంకులకు చెల్లించింది రూ. 7500 కోట్లు. అంటే ఇంకా రూ. 7900 కోట్లు బకాయే. ఇప్పుడు చెల్లించింది కూడా 2015-16 బకాయిలన్నమాట. ఇంకా 2016-17, 2017-18 సంవత్సరాల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ఏమో.

Follow Us:
Download App:
  • android
  • ios