ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆ ఫైల్ పై సంతకం పెట్టడంతో ఇక మూడు రాజధానుల ఏర్పాటు లాంఛనమే అయింది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత ప్రజలు తీవ్ర రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. 

టీడీపీకి ఇది ఒక షాక్ అంటే వైసీపీ తమ పంతం నెగ్గించుకుంది. బీజేపీ ఏమో కేంద్రం ఇందులో జోక్యం చేసుకోలేదు, కానీ తాముమాత్రం అమరావతిలోని రాజధాని ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. వీరందరి విషయాన్నీ పక్కనబెడితే పవన్ కళ్యాణ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. 

బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడు అమరావతికి కట్టుబడి ఉంటామనే కమిట్మెంట్ మీదనే తాను బీజేపీతో కలిశానని అన్నాడు. అమరావతి రైతులు వచ్చి పవన్ కళ్యాణ్ కి తమ బాధలను చెప్పుకుంటే ఆలకించారు. ఆయన అమరావతి మహిళలు తమకు జరిగిన అన్యాయం చెప్పినప్పుడు కన్నీరు పెట్టి మరి ప్రభుత్వం పై దుమ్మెత్తిపోశారు. 

ఇప్పుడు మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారని విషయాన్నీ వేచిచూడాలి. ఆయన అమరావతికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి ఆయా ప్రాంతంలో పర్యటించారు. అక్కడి రైతులకు అమరావతికోసం పోరాడుతానని వాగ్దానం చేసారు. 

ఇప్పుడు ఆయన ప్రభుత్వం తరుఫున ఎలా మాట్లాడతారు అనేది వేచి చూడాలి. ఆయన బీజేపీ తరుఫున వకాల్తా పుచ్చుకొని మూడు రాజధానుల విషయంలో తానేమి చేయలేకపోయానని అంటాడా అనేది చూడాల్సిన అంశం. ఆయన మాత్రం చాతుర్మాస దీక్ష అంటూ తన ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు. 

రాజకీయ పరిస్థితులేవి తనకు పట్టవు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ పత్రికా ప్రకటనలయితే వదులుతున్నారు కానీ ఆయన మాత్రం కనబడడం లేదు. తన అభిమాని పిలిచాడని పెళ్ళికి హాజరయ్యాడు కానీ... ఇక్కడ ఇంతమంది ప్రజల జీవితాలకు సంబంధించిన అమరావతికోసం కూడా పవన్ బయటకు రావడంలేదు. 

రాజధాని రైతుల గనుక పవన్ ఇప్పుడు బీజేపీతో ఉన్న పొత్తును ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నిస్తే... పవన్ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. రాజకీయాల్లో పార్టీలకు నైతిక విలువల కన్నా వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనే విషయాన్నీ మనం చాలాసార్లు చూసాము. కానీ పవన్ ఆ తరహా రాజకీయాలు చేయనని చెప్పాడు. 

ఈ పరిస్థితుల నడుమ వేచి చూడాలి పవన్ ఎలా స్పందిస్తాడో. ఆయన ఇప్పటికైనా తన ఫార్మ్ హౌస్ ధాటి బయటకు వస్తాడా, లేదా కొన్ని రోజుల్లో ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోతారు, అప్పటికి తన చాతుర్మాస దీక్ష అయిపోతుందని మిన్నకుండా ఉంటారా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.