ఆంధ్ర ప్రదేశ్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపి ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 70వ గణంతత్ర దినోత్సవ  వేడుకలను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి చినరాజప్పతో పాటు మిగతా మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసుల నుండి గవర్నర్ గైవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమం, పథకాలు, అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. 

అనంతరం గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వ పాలన, అభివృద్ది గురించి ప్రసంగించారు. మొదట రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ప్రజాభీష్టం ప్రకారమే రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరేళ్లలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఘననీయమైన అభివృద్ది జరిగిందన ప్రశంసించారు. విభజన కష్టాలను ఒక్కోటిగా అధిగమిస్తూనే అభివృద్ది వైపు రాష్ట్రాన్ని నడిపించడంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి  మరిచిపోలేనిదని నరసింహన్ ప్రశంసించారు.   

ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రభుత్వం భారీ ఉత్పాదకతను పెంచడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచిందని గవర్నర్‌ ప్రశంసించారు. ప్రభుత్వ కృషి, అందిస్తున్న ప్రోత్సాహకాల మూలంగా పెట్టుబడుల వేగం పెరిగిందన్నారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ తో పాటు మౌళిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఎల్లపుడూ ముందుంటుందని గవర్నర్ తెలిపారు. 

ఇక ఇప్పటికే తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తోందని గవర్నర్ గుర్తు చేశారు. తాజాగా  ఈ నెల నుండి పెన్సన్లను రూ.2 వేలకు పెంచినట్లు తెలిపారు. అలాగే ప్రతి గ్రామానికి రవాణా సదుపాయాన్ని మెరుగుపర్చడానికి రోడ్లు నిర్మిస్తున్నామని...అంతర్గతంగా కూడా సిసి రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 

వ్యవసాయానికి కూడా ఆటంకం లేకుండా విద్యుత్ అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. లోటు విద్యుత్ తో కష్టాల్లో వున్న రాష్ట్రాని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చి ప్రభుత్వం తన పనితనాన్ని నిరూపించుకుందని గవర్నర్ వెల్లడించారు.