త్వరలో 14 వేల టీచర్ పోస్టుల భర్తీ

First Published 23, Dec 2017, 7:44 AM IST
Government to fill up 14 thousand teacher posts through appsc
Highlights
  • రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొలువుల భర్తీకి చంద్రబాబునాయుడు శ్రీకారం చుడుతున్నారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొలువుల భర్తీకి చంద్రబాబునాయుడు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలున్నాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఖాళీల భర్తీకి ఆర్ధికశాఖ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకుంటున్నారు. అందులో భాగంగా మొదట ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టింది. ఉద్యోగ కల్పనలో ఇప్పటికే జాప్యం అయిందన్న  ఆరోపణలు వున్నందున చకచకా ఖాలీలను నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మొత్తం 13 జిల్లాల్లోనూ వివిధ విభాగాల్లో కలిపి సుమారు 14,167 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గుర్తించింది. అయితే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముందుగా 12,370 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగానే మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన కూడా చేసారు. అయితే, తర్వాత మరికొన్ని పోస్టులు కలిసాయి.  ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఆర్ఎంఎస్ఏ యాజమాన్యాల ఆధీనంలోని స్కూళ్ళల్లోని పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. దాంతో పోస్టుల సంఖ్య పెరిగింది. అయితే, వీటికి మున్సిపల్టీల్లోని 1447 పోస్టులు, మోడల్ స్కూళ్ళ పోస్టులు 163 కలవటంతో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య 12370 నుండి 14167కి పెరిగింది. ఆర్ఎంఎస్ఏ ఆధీనంలోని పోస్టులు 860 కూడా కలిసే అవకాశం ఉంది. ఒకవేళ అవికూడా కలిస్తే భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య సుమారు 15 వేలకు చేరుకుంటుంది.

అన్నీ జిల్లాల నుండి సరైన సమాచారం అందగానే వివరాలను ఆర్ధికశాఖకు పంపుతారు.  భర్తీకి అనుమతి తీసుకుని ఏపిపిఎస్సీకి పంపుతారు. పోస్టులన్నింటినీ ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే కదా? రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయపోస్టుల భర్తీపై శుక్రవారం విజయవాడలో జిల్లా విద్యాశాఖాధికారులతో పెద్ద సమావేశం కూడా జరిగింది.

అయితే, ఇక్కడే ఓ చిక్కు వచ్చింది. ఏంటంట, గతంలో సేకరించిన లెక్కలకు తాజాగా విద్యాశాఖాధికారులిచ్చిన లెక్కలకు మధ్య తేడాలున్నాయి. ఈతేడాలు ఎలా వచ్చాయన్న విషయంపైనే ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. అంటే, నికరంగా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలన్న విషయంలో ఇప్పటికీ స్పష్టమైన సమాచారం అందలేదన్న విషయం అర్ధమవుతోంది.

 

 

loader