ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు తాము కార్పోరేట్ స్కూల్స్‌కి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు. ఏకంగా సీఎం వైఎస్ జగన్ ముందే ఇంగ్లీష్‌లో అదరగొట్టారు. ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు పిల్లలు ఆంగ్లంలో సమాధానమిచ్చారు.
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు (govt schools) అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. సర్కారీ బడుల్లో చదువు సరిగా చెప్పరని, నాణ్యమైన విద్య ఉండదని, టీచర్లు సరిగా రారని, ఇంగ్లీష్‌లో వెనుకబడిపోతారని, క్లాసులు సరిగా నిర్వహించరనే వాదనలు వినిపిస్తాయి. అయితే, ఆ అభిప్రాయాల్లో నిజం లేదని, అవి కేవలం అపోహలు మాత్రమే అని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నిరూపిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌లో (english) గుక్క తిప్పుకోకుండా మాట్లాడి అదగొట్టారు. అది కూడా స్కూల్‌లో కాదు.. ఏకంగా ఏపీ సీఎం జగన్ (ys jagan) ముందు. వారి ప్రతిభకు ముఖ్యమంత్రి కూడా ఫిదా అయిపోయారు.
వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా (kakinada) బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ (bendapudi govt school) విద్యార్థులు గురువారం సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు జగన్ ముందు కూర్చుని ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎలాంటి తడబాటు లేకుండా సీఎం జగన్‌తో ఇంగ్లీషులో మాట్లాడడం విశేషం. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన, నాడు-నేడు పథకాల విశిష్టతను పిల్లలు ఇంగ్లీష్‌లో జగన్‌కు చక్కగా వివరించారు.
ఇలాంటి కార్యక్రమాలతో, పథకాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారంటూ సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనతో ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఎంతో లబ్ది చేకూరుతోందని పిల్లలు సీఎంతో చెప్పారు. ప్రభుత్వ పథకాలు, వాటి వల్ల విద్యార్థులకు జరుగుతున్న మేలు గురించి పిల్లలు వివరిస్తుంటే.. సీఎం జగన్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడడం ఆయనను అమితానందానికి గురిచేసింది. వారి ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని ఆద్యంతం చిరునవ్వుతో ఆస్వాదించిన సీఎం, ఆ విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు.
