అమరావతి:  ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుకగా పెన్షన్‌ను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి నెల వెయ్యి రూపాయాల పెన్షన్‌ను రూ.2వేలకు పెంచుతున్నట్టుగా ప్రకటించారు. 

నెల్లూరులో జరిగిన జన్మభూమి సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు  పెన్షన్ పెంపు గురించి కీలక ప్రకటన చేశారు. పది రకాల పెన్షన్ లబ్దిదారుల కు రెట్టింపు చేస్తున్నట్టు సర్కార్ నిర్ణయం తీసుకొంది.

ప్రస్తుతం వృద్దాప్య పెన్షన్లను వెయ్యి నుండి రెండు వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. జనవరి మాసానికి చెందిన పెన్షన్‌ను ఫిబ్రవరి మాసంలో  ప్రతి ఒక్క లబ్దిదారుడికి రూ.3 వేలను ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు  ప్రకటించారు. ఫిబ్రవరి నెల నుండి ప్రతి నెల రూ. 2వేలను పెన్షన్ గా ఇవ్వనున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం 51 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు రాష్ట్రంలో ఉన్నారు. దివ్యాంగులు, హిజ్రాలకు ఇస్తున్న పెన్షన్‌ను వెయ్యి నుండి రూ.1500లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.జన్మభూమి సభల్లో  సుమారు లక్షన్నర వరకు కొత్తగా పెన్షన్ కోసం  ధరఖాస్తులు వచ్చే  అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పెన్షన్ పెంచుతూ ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయం వల్ల   ప్రతి ఏటా పదమూడున్నర లక్షల కోట్లు ఖర్చు కానుంది.