Asianet News TeluguAsianet News Telugu

ఇక పవన్ చుట్టూ కమాండోలు... అసలు ఏమిటీ వై ప్లస్ సెక్యూరిటీ? ఎలా వుంటుంది?

సినిమాల్లో పవర్ స్టార్ కాస్త రాజకీయాల్లో పవర్ ఫుల్ స్టార్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కు భద్రతను పెంచారు. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీ కేటాయించారు... ఆ క్రమంలో అసలు వై ప్లస్ సెక్యూరిటీ ఎలా వుంటుందో చూద్దాం...

Government Allocate Y Plus security  to AP Deputy CM Pawan Kalyan AKP
Author
First Published Jun 18, 2024, 5:21 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందు ఓ లెక్క... ఆ తర్వాత మరోలెక్క... అన్న గెలిచాడు... మా పవనన్న గెలిచాడోచ్... ఇది మెగా ఫ్యాన్స్, జనసైనికులు ప్రస్తుతం కాలర్ ఎగరేసుకుని చెబుతున్న మాట. ఎన్నికలు ముగిసి ఇంకా ఫలితాలు వెలువడకముందే మేం పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అంటూ... ఫలితాలు వెలువడ్డాక మేం డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ పవన్ ఫ్యాన్స్ మామూలు రచ్చ చేయలేదు. ఇప్పుడు నిజంగానే పవన్ చేతిలోకి అధికారం వచ్చింది... ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అయ్యారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాతీరాజ్ & గ్రామీణాభివృద్ది, అటవీ పర్యావరణ, సైన్స్ ఆండ్ టెక్నాలజీ శాఖల మంత్రి అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతిస్థానం పవన్ దే... నిజం చెప్పాలంటే సీఎంతో సమానమైన హోదా, గౌరవాన్ని ఆయన పొందుతున్నారు. 

ఇలా పవన్ ఇప్పుడు మామూలు సినీనటుడు, ఓ పార్టీ అధ్యక్షుడు కాదు...  డిప్యూటీ సీఎం. దీంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. సాధారణంగానే పవన్ కల్యాణ్ వస్తున్నాడంటే ఫ్యాన్స్ హడావుడి వుంటుంది. మరి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారు, వెనకాల అధికారిక కాన్వాయ్, గన్నులు చేతబట్టి కాపుకాసే భద్రతా సిబ్బంది... ఇలా పవన్ ను చూస్తుంటే రెండుకళ్లు చాలడంలేదని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా అమరావతిలో పవన్ పర్యటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కు ఇప్పటికే ప్రభుత్వం భద్రతను పెంచింది... ఆయనకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అందిస్తోంది. సెక్యూరిటీ వెంటరాగా, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తూ పవన్ కనిపించడం ఆయన అభిమానులకు కనువిందు చేస్తోంది. 

ఏమిటీ వై ప్లస్ సెక్యూరిటీ : 

భారతదేశంలో రాజకీయ, వ్యాపార, సినీ మరియు వివిధ రంగాల్లో పనిచేసే ప్రముఖులకు ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది. వారి హోదా, పొంచివున్న ప్రమాదాన్ని బట్టి సెక్యూరిటీ వుంటుంది. ప్రముఖుల కోసం వివిధ కేటగిరీల సెక్యూరిటీ వ్యవస్థను రూపొందించారు... ఇవే మనం తరచూ వినే జడ్ ప్లస్, జడ్, వై ప్లస్, వై, ఎక్ (Z+,Z, Y+,Y, X) సెక్యూరిటీ.  

అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు కేటాయించిన సెక్యూరిటీ వై ప్లస్. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించనున్న పవన్ కు మొత్తం 11 మందితో సెక్యూరిటీ కల్పిస్తారన్నమాట. ఇందులో 2-4 మంది సిఆర్ఫిఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) లేదా సిఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) కమాండోస్ నిత్యం పవన్ వెంట వుండి భద్రత కల్పిస్తారు. అలాగే రాష్ట్ర పోలీసులు కూడా పవన్ సెక్యూరిటీ టీంలో వుండనున్నారు. 

ఇక డిప్యూటీ సీఎం పవన్ కు ప్రభుత్వమే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కల్పిస్తుంది. ఇలా వై ప్లస్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ప్రతినెలా సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేయనుంది. ఇలా పవన్ భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 

పవన్ క్యాంప్ ఆఫీస్ ఇదే : 

ఇక డిప్యూ టీ సీఎం పవన్ కు విజయవాడలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుచేసారు అధికారులు. విజయవాడలోని జలవనరుల శాఖ అతిథిగ‌ృహాన్ని పవన్ కు కేటాయించారు. ఇవాళ ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈ క్యాంప్ కార్యాలయాన్ని పవన్ పరిశీలించారు. 

హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ రోడ్డుమార్గంలో విజయవాడకు చేరుకున్నారు. ఆయన జలవనరుల శాఖ అతిథిగ‌ృహం వద్దకు చేరుకోగానే పోలిసులు గౌరవ వందనం అందించారు. ఇలా పోలీసులు పవన్ కు సెల్యూట్ చేయడం చూసి అభిమానులు మురిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

ఇక తన కోసం కేటాయించిన క్యాంప్ కార్యాలయాన్ని పవన్ పరిశీలించారు. ఈ క్రమంలో పై అంతస్తులో నివాసం... కింద అంతస్తులో కార్యాలయం ఏర్పాటుచేయాలని పవన్ సూచించారు. అలాగే ఈ భవనం పక్కనే సమావేశ మందిరం అందుబాటులో వుండగా దాన్నికూడా పరిశీలించారు. అధికారులకు కొన్ని మార్పులు చేర్పులు సూచించిన పవన్ ఈ భవనాన్నే క్యాంప్ కార్యాలయంలో ఓకే చేసేసినట్లు తెలుస్తోంది.

సచివాలయంలో పవన్ కు స్పెషల్ పేషీ : 

పవన్ కల్యాణ్ కేవలం మంత్రి మాత్రమే కాదు డిప్యూటీ సీఎం కూడా. దీంతో ఆయనకు సచివాలయంలో సాధారణంగా కాకుండా ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు అధికారులు. గతంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ పేషీ ఐదో బ్లాక్ లో వుండగా ప్రస్తుతం దాన్ని రెండో బ్లాక్ కు మార్చారు. సీఎం చంద్రబాబు పేషీ ఒకటో బ్లాక్ లో వుంటుంది... దీంతో పవన్ పేషీని దగ్గరగా రెండో బ్లాక్ లో ఏర్పాటుచేసారు. జనసేన పార్టీకి చెందిన మిగతా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు కూడా ఇదే రెండో బ్లాక్ లో పవన్ పేషీ పక్కనే కార్యాలయాలు కేటాయించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios