అమరావతి:  హిందూపురం నుంచి లోకసభకు గెలిచిన తర్వాత డిఎస్పీ స్థాయి అధికారి తనకు సెల్యూట్ చేశాడని వచ్చిన వార్తలపై గోరంట్ల మాధవ్ స్పందించారు. సిఐగా రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

తాను ముందు సెల్యూట్‌ చేసిన తర్వాత పై అధికారి బదులుగా స్పందించారని గోరంట్ల మాధవ్ చెప్పారు. తాను ఎంపీనైనా తనకన్నా పై అధికారులు ఎదరుపడితే ఇకపై కూడా సెల్యూట్‌ చేస్తానని చెప్పారు. యూనిఫామ్‌ ధరించిన పోలీస్‌ అధికారిగా స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలు గుర్తించానని ఆయన చెప్పారు. వీలైనంత వరకూ వాళ్లకు న్యాయం చేశానని, అదే నన్ను అనంతపురం జిల్లాలో గబ్బర్‌సింగ్‌ పోలీస్ ను చేసిందని అన్నారు. 

ఇప్పుడు ఖాకీతోపాటు స్టేషన్‌ను వదిలేసి ఖద్దరు ధరించి పార్లమెంటుకు వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అయితే అంతకన్నా ఎక్కువ భయంగా ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలీస్ స్టేషన్‌ నుంచి పార్లమెంటుకు వెళుతున్న తనకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదని, వైసీపీ ఎంపీలందరి అజెండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమేనని చెప్పారు.
 
కరువు ప్రాంత ప్రజల కష్టాలపై మరింత అధ్యయనం చేసి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. పోలీస్‌ అధికారిగా తానెప్పుడూ భయపడలేదని, తనను ఎంపీగా సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని తలచుకుంటే భయం వేస్తోందని అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడతానని మాధవ్ అన్నారు.